Ind vs Eng: ఆ క్రికెటర్ కెరీర్ ముగిసినట్టేనా..?

అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం దొరకడం అనేది అంత సులువు కాదు. ఒక్కసారి అవకాశం వస్తే నిరూపించుకోవడానికి ఎందరో ఆటగాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరికి అద్రుష్టం కలిసి వస్తే మరికొందరు దురద్రుష్టంతో క్రికెట్ నుంచి తప్పుకుంటారు. ఒక్కసారి అవకాశం కోల్పోయి మళ్ళీ దక్కించడం అనేది కల. కాని ఆ కలను నిజం చేసుకున్న తర్వాత కూడా ఓ క్రికెటర్ నిలబెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఎవరు ఆ క్రికెటర్..? ఏంటి ఆ కథ అనేది ఒకసారి చూద్దాం.
అతనే కర్ణాటకకు చెందిన కరుణ్ నాయర్(Karun Nair). ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన నాయర్.. ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అక్కడి నుంచి నాయర్ కెరీర్ ఎన్నో కష్టాలు పడింది. ఎట్టకేలకు.. దేశవాళి క్రికెట్ లో మంచి ప్రదర్శనతో మళ్ళీ జట్టులోకి వచ్చాడు. కాని ఇంగ్లాండ్ పర్యటనలో అతను దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. మొదటి టెస్ట్ లో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఫెయిల్ అయ్యాడు కరుణ్ నాయర్. ఆ తర్వాత అతన్ని మూడవ స్థానానికి మార్చారు.
అక్కడ కూడా నిలకడగా పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండవ ఆటగాడు నాయర్. కాని అతని రెండవ అత్యధిక 40 పరుగులు. ఈ సీరీస్ లో అతను కేవలం ఆరు ఇన్నింగ్స్ లలో కలిపి 136 పరుగులు చేసాడు. ఓ వైపు యువ ఆటగాళ్ళు జట్టులో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటే వచ్చిన అవకాశాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. దీనితో నాలుగో టెస్ట్ లో అతనికి అవకాశం రావడం కష్టమే అంటున్నాయి భారత క్రికెట్ వర్గాలు. నాలుగో టెస్ట్ లో దాదాపుగా సాయి సుదర్శన్ (Sai Sudarshan)కు చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన మూడవ టెస్ట్ లో నాయర్ ఫెయిల్ కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.