Rohit Sharma: కోహ్లీ బాటలోనే రోహిత్ కూడా..?

టీమిండియా(Team India) వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ లండన్ మూవ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. రెండు రోజుల నుంచి దీనిపై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎక్కువగా లండన్ లోనే ఉంటున్నాడు. భారత్ లో ఏదైనా మ్యాచులు జరిగితే మాత్రమే వస్తున్నాడు కోహ్లీ. లేదంటే ఎక్కువగా కుటుంబంతో కలిసి అక్కడే ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు.
భారత్ లో అయితే తనకు అభిమానుల కారణంగా స్వేచ్ఛ ఉండదు అనే భావనలో ఉన్న విరాట్ కోహ్లీ నాలుగైదు ఏళ్ల క్రితం నుంచి లండన్ లో నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఖరీదైన ప్రాంతంలో ఓ ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాధన్ ట్రాట్ బయట పెట్టాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా లండన్ వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీ నివాసానికి సమీపంలోనే రోహిత్ శర్మ కూడా ఇల్లు కొనుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం భారత్ వన్డే క్రికెట్ తక్కువగా ఆడుతోంది. ఆడితే టి20లు లేదంటే టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి.. దీనితో రోహిత్ శర్మ త్వరలోనే పూర్తిగా ఫ్యామిలీని లండన్ షిఫ్ట్ చేయవచ్చు అని.. జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ లండన్ లోనే ఉన్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ కంటే ముందే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వాస్తవానికి ఇంగ్లాండ్ టూర్ లో రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉంది అనే ప్రచారం సైతం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్ శర్మ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మునపటిలా పరుగులు చేయడానికి రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. దీనితో తప్పుకోవాలని బోర్డు పెద్దలు ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. గత ఏడాది టి20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20 లకు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ ఆడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. విరాట్ కోహ్లీ కొనసాగే అవకాశాలు కనబడుతున్నా.. రోహిత్ శర్మ మాత్రం ఫిట్నెస్ తో ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్న మాట.