Tehran: కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదు.. ట్రంప్ మాటలు నిజం కాదన్న ఇరాన్..

పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel War) మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో పలుచోట్ల సైరన్ల మోత మోగింది.
ఇరాన్ (Iran) క్షిపణులు తమ దేశం వైపు దూసుకొస్తున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రజలను హెచ్చరించింది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ (Israel)ను లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. జెరూసలెం, బీర్‌షెబా ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా బీర్‌షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. అందులోని ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కాగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు ఇరాన్ 6 క్షిపణులను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
టెహ్రాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఈ క్షిపణులను ప్రయోగించింది. అంతకుముందు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల్లోపు టెల్‌అవీవ్ దాడులు ఆపితేనే.. తాము కూడా సంఘర్షణలను నిలువరిస్తామని ఆయన తెలిపారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఇరాన్ మళ్లీ దాడులు చేయడం గమనార్హం. అటు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టెహ్రాన్‌లోనూ సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. అయితే, ఈ ప్రకటనపై తొలుత విరుద్ధ ప్రకటన చేసిన ఇరాన్.. ఆ తర్వాత ఒప్పందానికి సుముఖత వ్యక్తంచేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్ (Israel) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.