DAVOS: దావోస్ లో పెట్టుబడుల వరద… వైబ్రంట్ ఇండియా ..
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించిన సదస్సులో భారత్ అదరగొట్టింది. ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కుదుర్చుకుంది. ముందునుంచి సమగ్ర వ్యూహంతో అడుగులేసిన కేంద్రం.. మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini vaishnav) నేతృత్వంలో.. ముగ్గురు సీఎంలు, ఐదుగురు కేంద్రమంత్రులు, వందమంది సీఈవోలతో భారీ బృందాన్ని దావోస్ పంపింది. తమ, తమ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను.. వారుస్వయంగా సదస్సులో వినిపించారు.
ఈసారి సదస్సులో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. వారే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్(fadnavis), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(revanth reddy), ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(chandrababu). ముగ్గురు తమ రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను .. సదస్సులో వివరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రతినిధి బృందం .. ఏకంగా 15.70 లక్షల కోట్ల రూపాయల విలువైన 61 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది, అంటే మొత్తం పెట్టుబడుల్లో దాదాపు 80శాతం ఆకర్షించగలిగింది. వీటి ద్వారా 16 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.
సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారించి రూ. 1.79 లక్షల కోట్ల విలువైన 20 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది, వీటి ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ .. వ్యాపార వర్గాలను ఆకర్షించింది.
ఉత్తరప్రదేశ్ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి, దాని ప్రణాళికలను ప్రదర్శించింది. వేలకోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోవడంలో విజయం సాధించింది.ప్రగతిశీల ప్రభుత్వ విధానాల వల్ల తమ రాష్ట్రం.. పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని కేరళ ప్రతినిధులు తెలిపారు. కేరళ పరిశ్రమల మంత్రి పి రాజీవ్ ఇన్వెస్ట్ కేరళ పెవిలియన్లో 30కి పైగా వన్-టు-వన్ సమావేశాలను నిర్వహించారు విభిన్న రంగాలలో పెట్టుబడి అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు. హిందుస్థాన్ యూనిలీవర్.. తెలంగాణలో రెండు కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.అనేక ఇతర గ్లోబల్ కంపెనీలు భారతీయ కంపెనీలతో ఎంవోయులు కుదుర్చుకున్నాయి.






