India: 13 వేల అడుగులో అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ..చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సన్నాహాలు

జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా …భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
ఈ ప్రాంతంలో రక్షణ దళాల మోహరించడానికి, వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. ఇది అత్యవసర కార్యకలాపాలకు మద్దతుగా నిర్వించబడింది. ఈ ఎయిర్ ఫీల్డ్ 3 కి.మీ రన్ వేను కలిగి ఉంది. 2021లో అమోదించిన ఈ ప్రాజెక్టు విలువ సుమారుగా రూ. 214 కోట్లు. న్యోమా భారత్ రక్షణకు ప్రత్యేకమైన ఆస్తిగా ఉంది. ఉత్తర సరిహద్దు ప్రాంతంలో భూ రవాణా కష్టంగా ఉండటంతో, పర్వత ప్రాంతాల్లో వేగంగా మోహరింపు, వనరుల సమీకరణకు ఇది వీలు కల్పిస్తుంది.
ఐదేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారత్ లడఖ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాలు, వంతెనలనున నిర్మించే పనిని వేగవంతం చేసింది. డెమ్‌చోక్, డెప్సాంగ్‌లో ఇటీవల ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లిన తర్వాత, న్యోమా ప్రాముఖ్యత పెరిగింది.