Delhi: మనకూ బంకర్ బ్లస్టర్ బాంబ్స్… డీఆర్డీవోలో అగ్ని-5 కొత్త వెర్షన్ తయారు..?

ఇరాన్ అణ్వాయుధ స్థావరాలు, సైట్ల పేల్చివేతలో ఉపయోగించిన బంకర్ క్లస్టర్ బాంబులు .. మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కొండల కింద భూగర్భంలో కొన్ని మీటర్ల లోతున పటిష్టమైన రాతిపొరల నడుమ ఏర్పాటు చేసిన అణ్వాయుధ కేంద్రాలను .. పేల్చేందుకు అమెరికా బంకర్ క్లస్టర్ బాంబులను ఇరాన్ పై ప్రయోగించింది.దీంతో ఈ బాంబుల సత్తా ప్రపంచానికి తెలిసివచ్చింది. దీనికి తోడు ఎటు చూసిన యుద్ధవాతావరణం కనిపిస్తుండడంతో.. పలు దేశాలు అమెరికా బాటలో నడవాలని భావిస్తున్నాయి. అయితే.. ఈదిశగా మనదేశం ఇండియా సైతం ఓ అడుగు ముందుకేసిందని చెప్పాలి.
ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై జూన్ 22న అమెరికా జీబీయూ-57/ఎ మాసివ్ ఆర్డ్‌నెన్స్ పెనెట్రేటర్లను ప్రయోగించింది. బంకర్ బస్టర్ బాంబులుగా పేరొందిన ఈ అస్త్రాలు నేల లోపల 60 మీటర్ల వరకూ చొచ్చుకెళ్లి.. పెను విస్ఫోటాన్ని కలిగిస్తాయి. అంతర్జాతీయ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్ యుద్ధాల కోసం ఇలాంటి బాంబులతో సిద్ధంకావాలని భారత్ నిర్ణయించింది. ఇందులో భాగంగా.. పటిష్ఠ నేలమాళిగల్లోని లక్ష్యాల్లోకి చొచ్చుకెళ్లేందుకు శక్తిమంతమైన అస్త్రం తయారీకి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బాంబర్లు అవసరంలేకుండానే..
అమెరికా.. తన బంకర్ బస్టర్ బాంబులను లక్షిత ప్రదేశానికి చేరవేయడానికి ఖరీదైన బి-2 బాంబర్ విమానాన్ని ఉపయోగిస్తోంది. దీనికి భిన్నంగా బాంబును క్షిపణి ద్వారా ప్రయోగించేలా భారత్ డిజైన్ చేస్తోంది. తద్వారా మరింత వెసులుబాటుతో కూడిన చౌకైన వేదిక సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఖండాంతర క్షిపణి అగ్ని-5కి సంబంధించిన కొత్త వెర్షన్‌ను డీఆర్‌డీవో రూపొందిస్తోంది. వాస్తవ అగ్ని-5 క్షిపణికి 5వేల కిలోమీటర్లకుపైగా పరిధి ఉంది. అది అణు వార్‌హెడ్లనూ మోసుకెళుతుంది. దానికి భిన్నంగా తాజా వెర్షన్.. 2,500 కిలోమీటర్లు మాత్రమే పయనిస్తుంది. అది సంప్రదాయ ఆయుధంగానే ఉంటుంది. యితే భారీ స్థాయిలో 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌ను మోసుకెళుతుంది.
పెను విధ్వంసకశక్తి..
భారత అస్త్రం.. అమెరికా బంకర్‌బస్టర్ కన్నా ఎక్కువ విధ్వంసక శక్తిని కలిగి ఉంటుంది. ఇది నేల లోపలికి 80 నుంచి 100 మీటర్ల మేర చొచ్చుకెళ్లి ఆ తర్వాత విస్ఫోటం చెందుతుంది. పటిష్ఠ కాంక్రీటు పొరల కింద ఉన్న శత్రు సైనిక కేంద్రాలను ధ్వంసం చేయగలిగేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ వార్‌హెడ్ 8 టన్నుల బరువుంటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తిమంతమైన సంప్రదాయ వార్‌హెడ్‌లలో ఒకటిగా ఇది నిలిచిపోనుంది.
రెండు వేరియంట్లు
అగ్ని-5కు సంబంధించిన రెండు వేరియంట్లు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎయిర్‌బర్స్ట్ వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. దాన్ని ఉపరితలం మీదున్న లక్ష్యాల కోసం రూపొందిస్తున్నారు. మరొకటి.. నేలలోకి లోతుగా చొచ్చుకెళ్లే క్షిపణి. ఇది ఉపరితలానికి కిందున్న పటిష్ఠ బంకర్లను ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. జీబీయూ-57 తరహాలో ఉంటుంది. ఈ క్షిపణులు ధ్వని కన్నా 8 నుంచి 20 రెట్ల వేగాన్ని సాధించే అవకాశం ఉంది. అందువల్ల హైపర్‌సోనిక్ అస్త్రాల విభాగంలోకి వస్తాయి. ఇవి వేగం విషయంలో అమెరికా బంకర్‌బస్టర్ వ్యవస్థలను పోలి ఉంటాయి. అయితే పేలోడ్ సామర్థ్యం మాత్రం చాలా ఎక్కువని చెప్పాలి.