Golden Visa: భారతీయులకు యూఏఈ బంపర్ ఆఫర్

భారతీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. కొత్త రకం గోల్డెన్ వీసా (Golden Visa)ను అందిస్తోంది. స్థిరాస్థి లేదా వ్యాపారంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ వీసాను పొందే అవకాశం కల్పిస్తోంది. నామినేషన్ ప్రాతిపదికన ఈ వీసాను ఇస్తోంది. ఇప్పటి వరకు దుబాయ్ గోల్డెన్ వీసాను భారతీయులు పొందడానికిగాను కనీసం రెండు మిలియన్ ఏఈడీల (రూ.4.66 కోట్లు) విలువైన ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలి లేదా దేశంలోని వ్యాపారంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఒక మార్గంగా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా నామినేషన్ ఆధారిత వీసా విధానం కింద భారతీయులు లక్ష ఏఈడీలు (దాదాపు రూ.23.30 లక్షలు) రుసుముగా చెల్లిస్తే జీవిత కాలానికి యూఏఈ గోల్డెన్ వీసా పొందవచ్చు.
ఈ వీసాను పరీక్షించే నిమిత్తం మొదటి విడతలో భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh ) ను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. భారత్‌లో ఈ వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు కన్సల్టెన్సీ సంస్థ రయాద్ గ్రూప్ ఎంపికైంది. ఈ గోల్డెన్ వీసా కోసం ఎవరైనా దరఖాస్తు చేయగానే మొదట తాము వారి నేపథ్యాన్ని పరిశీలిస్తామ ని, మనీలాండరింగ్, క్రిమినల్ రికార్డులతోపాటు వారి సోషల్ మీడియాను తనిఖీ చేస్తామని రయద్ గ్రూప్ ఎండీ రయాద్ కమల్ అయుబ్ (Rayad Kamal Ayub) పేర్కొన్నారు. ఆ తర్వాత రయాద్ గ్రూప్ ఆ దరఖాస్తును ప్రభుత్వానికి పంపుతుందని, అనంతరం నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.