Gowadia : అమెరికాలో భారత్ ఇంజినీర్‌కు … 32 ఏండ్ల శిక్ష

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లను ఉపయోగించిన విషయం తెలిసిందే. కీలక యుద్ధాల సమయంలో అమెరికా రంగంలోకి దించే ఈ యుద్ధ విమానం రూపకల్పనలో భారత్ మూలాలున్న ఒక ఇంజినీర్ (Engineer) కృషి కూడా ఉంది. అయితే ఈ ప్రాజెక్టు కీలక సమాచారాన్ని చైనా (China)కు అందించారన్న ఆరోపణలపై ఆయనకు అమెరికాలో 32 ఏండ్ల శిక్ష పడింది. 1944లో ముంబైలో జన్మించిన నోషిర్ షెరియార్జీ గోవాడియా (Noshir Sheriarji Gowadia) 1960లో అమెరికా వలస వెళ్లారు. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (Aeronautical Engineering) పూర్తి చేశారు. 1969లో అమెరికా పౌరసత్వం పొందారు. తర్వాత నార్తాప్ గ్రూమన్ కార్పొరేషన్‌లో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. రెండు దశాబ్దాల పాటు పనిచేసి బీ2 బాంబర్‌కు తుది రూపు తీసుకొచ్చారు.
ఇందులో ఇన్‌ఫ్రారెడ్, విజువల్ సిగ్నేచర్, రాడార్ తరంగాలను గ్రహించే వ్యవస్థల రూపకల్పనలో ఆయన ప్రముఖంగా వ్యవహరించారు. వీటితో పాటు విమాన ప్రొపెల్షన్ ప్రాజెక్టుల్లోనూ పనిచేశారు. తర్వాత అనారోగ్యం తో ఉద్యోగాన్ని వీడి సొంతంగా కన్సల్టెన్సీని ప్రారంభించారు. 1997లో ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. 2003-05 కాలంలో ఆయన చైనా అధికారులతో రహస్యంగా మంతనాలు సాగించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక బాంబర్ అభివృద్ధి ప్రాజెక్టులో రూ.91 లక్షలు తీసుకున్న ఆయన చైనాకు సహకరించినట్టు ఎఫ్‌బీఐ గుర్తించింది. 2005లో అతడిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 32 ఏండ్ల జైలు శిక్ష విధించింది.