Ind vs Eng: భారత్ కొంప ముంచిన రాహుల్ సెంచరీ..!

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడవ టెస్ట్ లో భారత్ చేసిన ఓ తప్పు కొంప ముంచింది. కెఎల్ రాహుల్ (KL Rahul) సెంచరీ కోసం రిషబ్ పంత్(Rishab Pant) తీసుకున్న తొందరపాటు నిర్ణయం పటిష్ట స్థితిలో ఉన్న భారత్ ను కష్టాలలోకి నెట్టింది. కేవలం రెండు మూడు పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ కు ముందు చివరి ఓవర్ లో రిషబ్ పంత్ రనౌట్ కాగా, విరామం తర్వాత కెఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. పంత్ 74 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ తన 10వ టెస్ట్ సెంచరీ (100) సాధించి అవుట్ అయ్యాడు.
దిలీప్ వెంగ్‌సర్కార్ తర్వాత లార్డ్స్ లో రెండు టెస్ట్ సెంచరీలు చేసిన రెండవ భారత బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలా ఒక వికెట్ తీశారు. పంత్, రాహుల్ నాల్గవ వికెట్‌కు 141 పరుగులు జోడించారు. టెస్ట్ క్రికెట్ లో సక్సెస్ఫుల్ జోడీగా పేరున్న పంత్ – రాహుల్ ఇంగ్లాండ్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఎన్ని వ్యూహాలు అమలు చేసినా సరే.. దుర్బేధ్యమైన డిఫెన్స్ తో వికెట్ నిలుపుకుంటూనే.. ఇద్దరూ పరుగులు చేసారు.
పంత్ తన మార్క్ షాట్స్ తో అలరించాడు. తన ఇన్నింగ్స్ లో ఓ సిక్స్ కొట్టిన రిషబ్ పంత్.. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన వెస్టిండీస్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ రికార్డ్ ను బ్రేక్ చేసాడు. గాయం ఓ వైపు ఇబ్బంది పెడుతున్నా సరే పంత్ అదరగొట్టాడు. కీలకమైన సమయంలో రాహుల్ తో కలిసిన పంత్.. తన సహజ ఆట తీరును పక్కన పెట్టి డిఫెన్స్ తో ఆకట్టుకున్నాడు. పంత్, రాహుల్ మరో గంట పాటు క్రీజ్ లో ఉండి ఉంటే భారత్ ఖచ్చితంగా మ్యాచ్ లో పట్టు బిగించేది.