China: భారత్-చైనా యుగళగీతం.. జిన్ పింగ్ తో మోడీ భేటీ..

ట్రంప్ టారిఫ్ ఆంక్షలు, ఆ పై పెద్దన్ననంటూ హెచ్చరికల నడుమ.. ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ తూరుపు.. ఈ పడమర అన్నట్లుగా దశాబ్దాల బద్దవైరం నుంచి అందరి మదిని ఆకట్టుకునే మైత్రీగీతం వినిపించింది. ముఖ్యంగా భారత ప్రధాని మోడీ (Modi) కి.. చైనా లో అపూర్వ స్వాగతం లభించింది. సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి,అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. భారత ప్రధాని నరేంద్రమోడీ దగ్గర ప్రస్తావించారు.
షాంఘై సహకార సదస్సు (ఎస్‌సీవో)ను పురస్కరించుకుని చైనాలోని తియాన్‌జిన్‌కు చేరుకున్న ఇరువురు అగ్రనేతలు చర్చలు జరిపారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. సరిహద్దు వివాదాల ఆధారంగా రెండు దేశాల సంబంధాలను నిర్వచించే అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. సరిహద్దు సమస్యలకు ‘సముచితమైన, సహేతుకమైన, పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం’ కనుగొనేందుకు కలిసి పనిచేయాలని నేతలిద్దరూ అవగాహనకు వచ్చారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడుల్ని విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, వాణిజ్యం పెంపొందించుకోవడంపై ఇద్దరు నేతలూ దృష్టి సారించారు.
ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సేవలు, వీసా సదుపాయాలు వంటివి చర్చకు వచ్చాయి. మోడీని మరోసారి కలవడం తనకెంతో ఆనందంగా ఉందంటూ జిన్‌పింగ్ ఆహ్వానం పలికారు. ‘మనం శత్రువులం కాదు అనేది దృష్టిలో పెట్టుకున్నంత కాలం ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా, నిలకడగా కొనసాగుతాయి. ఇరుగుపొరుగు దేశాలుగా మనం కలిసి ఉంటూ సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించుకోవాలి. డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేసేలా చూడాలి. అదే మనకు సరైన ఎంపిక’ అని జిన్‌పింగ్ చెప్పారు.
‘‘భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవుతోంది. వ్యూహాత్మక, దీర్ఘకాల దృక్కోణంలో మనం ద్వైపాక్షిక బంధాలను సమీక్షించుకోవాలి. అప్పుడే అవి నిలకడగా పురోగమిస్తాయి. వర్ధమాన దేశాలుగా మానవ సమాజాభివృద్ధికి బాటలు వేద్దాం’’ అని మోడీతో జిన్‌పింగ్ చెప్పారు. బహుళపక్ష వాదాన్ని నిలబెడదామని పరోక్షంగా అమెరికా ఏకపక్ష విధానాన్ని తప్పుబట్టారు. భిన్నధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో మరింత ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చేలా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఆసియాలో, యావత్ ప్రపంచంలో శాంతి-సౌభాగ్యాలకు మనవంతు చేయూత అందిద్దామన్నారు. వందేళ్లకోసారి వచ్చే సమూల రూపాంతరీకరణను ఇప్పుడు ప్రపంచం చూస్తోందని గుర్తుచేశారు.
పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వాలపై ఆధారపడి సరిహద్దులో శాంతి-సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు. భారత్-చైనా సంబంధాలు అభివృద్ధి చెందుతూనే ఉండాలంటే ఇవి ఎంతో ముఖ్యమన్నారు. లోటును భర్తీ చేసుకునేలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని ఇరువురు నిర్ణయించారు. ఉగ్రవాద నిర్మూలన సహా ప్రపంచవ్యాప్త అంశాలపై సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, బహుళపాక్షిక వేదికలపై సహేతుక వాణిజ్యం విషయంలోనూ ఒకరికొకరు చేయూతగా నిలవాలని తీర్మానించారు. మూడోదేశం కోణం నుంచి తమతమ బంధాలను చూడకూడదని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్ ఆధ్వర్యంలో 2026లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరుకావాలని జిన్‌పింగ్‌ను మోదీ కోరారు. ఎస్‌సీవోకు చైనా నేతృత్వానికి మద్దతు పలికారు. బ్రిక్స్‌కు భారత్ సారథ్యం వహించడానికి తాము మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ చెప్పారు. సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరు చర్చించుకున్నారు.