Ind vs Eng: ఆ బౌలర్ అరంగేట్రం కష్టమే..?

జాతీయ జట్టులో చోటు సంపాదించడం ఎంత కష్టమో.. తుది జట్టులో ఆడటం కూడా అంతే కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా సరే జట్టులో ఉన్న పోటీ ఆటగాళ్లకు అవకాశం కల్పించడంలో అడ్డు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో అదే జరుగుతోందనే ఆరోపణలు వినపడుతున్నాయి. బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కు ఇప్పటి వరకు అవకాశం కల్పించలేదు. ఇక బౌలర్ అర్షదీప్ సింగ్(Arshdeep Singh) పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉందనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి.
విఫలమైన వాళ్లకు ఒకటికి రెండు అవకాశాలు ఇస్తున్నారు గాని.. కీలక ఆటగాళ్లుగా సత్తా చాటుతారని భావిస్తున్న ఆటగాళ్లకు మాత్రం ఒక్క అవకాశం కూడా రాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అర్షదీప్ సింగ్ కు ఇంగ్లాండ్ లో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అక్కడి కౌంటీ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాడు అర్శదీప్. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా ఉన్న బౌలర్ కూడా అతను. లెఫ్ట్ హ్యాండ్ పేసర్ విషయంలో భారత్ ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతోంది.
అంత మంచి బౌలర్ దొరికినా సరే వాడుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలిగే సత్తా ఉన్న ఆటగాడు అర్షదీప్. అయినా సరే ఇప్పటి వరకు అవకాశం కల్పించలేదు. టి20 క్రికెట్ లో మాత్రం అతనికి అవకాశం కల్పిస్తున్నారు. బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారనే డైలాగ్ అతని విషయంలో సరిపోతుంది అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అతనిలో టెస్ట్ క్రికెట్ టాలెంట్ ఉంటే.. అతని టాలెంట్ ను వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఇంగ్లాండ్(England) కండీషన్స్ కు సరిగా సరిపోతాడు. అయినా సరే ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు. నలుగురు పేసర్లను ఆడించాలని, అతనికి అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. ముగ్గురు బౌలర్లతో జట్టు బరిలోకి దిగుతోందని.. పాత బంతితో కూడా రాణించే సత్తా ఉన్న అర్షదీప్ ను తీసుకుంటే.. కీలకమైన చివరి రెండు టెస్టుల్లో అతను సత్తా చాటడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఐపిఎల్ తో పాటుగా అంతర్జాతీయ టి20 లలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు. అయినా సరే అవకాశం కల్పించడంలో మాత్రం జట్టు యాజమాన్యం ముందుకు రావడం లేదు.