US Postal Services: యూఎస్‌కు పోస్టల్ సర్వీసులు మళ్లీ స్టార్ట్

భారత్‌పై అమెరికాతో సుంకాలతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు ఇటీవల నిలిపివేసిన అన్ని రకాల పోస్టల్ సేవలను (US Postal Services) బుధవారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికన్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విధించిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం, భారతదేశం నుంచి అమెరికాకు పోస్టల్ వస్తువులపై సుంకం రేటును ప్రకటించిన విలువలో 50 శాతంగా నిర్ణయించారు. కొన్నిరోజుల క్రితం దిగుమతి సుంకాల వసూలు, చెల్లింపుల కోసం సీబీపీ (CBP) కొత్త నిబంధనలు విధించిన సమయంలో యూఎస్‌కు పోస్టల్ సర్వీసులను (US Postal Services) భారత్ సహా పలు దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ పోస్టల్ సేవలను తిరిగి ప్రారంభించడంపై భారతీయ పోస్టల్ శాఖ (India Post) సంతోషం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), చేతివృత్తులవారు, చిన్న వ్యాపారులు, ఈ-కామర్స్ ఎగుమతిదారులకు ఊరట లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే డీడీపీ (DDP) సేవలకు ఎలాంటి అదనపు రుసుము ఉండబోదని కూడా పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.