Tehran: టెహ్రాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. రెండు ఎఫ్ 14 వార్ ప్లేన్స్ ధ్వంసం..

Iran- Israel | ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఈక్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్‌అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది.
‘టెహ్రాన్ విమానాశ్రయంలో ఉంచిన రెండు ఎఫ్-14 ఫైటర్ జెట్‌లపై దాడి చేశాం. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంచింది. దీన్ని మేం సమర్థమంతంగా అడ్డుకున్నాం. ఇరాన్ మాపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారనే నిఘా సమాచారం వివరాల మేరకు వాటిపై దాడి చేశాం. మా దాడిలో ఆ యుద్ధ విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని ఐడీఎఫ్ పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా పంచుకుంది. ఈ యుద్ధ విమానాలను 1979లో ఇస్లామిక్ రివల్యూషన్‌కు ముందు ఇరాన్‌కు అమెరికా డెలివరీ చేసింది. ఇప్పటికీ వీటినే వాడుతోంది. ఈక్రమంలో ఇరాన్ ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా కల్లోలంగా మారింది. ఇరుదేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. ఇక, ఇరాన్ దౌత్య చర్యలను ఆయన తోసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టించేవన్నారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయెల్‌కు కచ్చితమైన సమాచారం ఉందన్నారు.