Gambhir: కోచ్ నియంతగా మారాడా..? బంగ్లాదేశ్ బెటర్ అయిందా..?

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో కోచ్ పాత్ర చాలా కీలకం. జట్టు విజయాల్లో కోచ్ వ్యూహాలు, అతని శిక్షణ అన్నీ కూడా జట్టును గట్టు ఎక్కిస్తాయి. అగ్ర జట్ల నుంచి కొత్త జట్ల వరకు అన్నీ కూడా కోచ్ ల నుంచి సహకారం కోరుకుంటాయి. కోచ్ నియంతగా మారితే మాత్రం జట్టు విజయాలపై ప్రభావం పడుతుంది. జట్టు ఎంపిక నుంచి అన్ని అంశాల్లో కూడా కోచ్ సమర్ధవంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మ్యాచ్ లో పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇండియా విషయంలో మాత్రం అలా జరగడం లేదు.
కోచ్ గా గంభీర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత్ టెస్ట్ జట్టు రోజు రోజుకు దారుణంగా మారుతోంది. న్యూజిలాండ్ తో వైట్ వాష్ నుంచి.. ఇంగ్లాండ్(Ind vs Eng) తో ఫస్ట్ టెస్ట్ ఓడిపోవడం వరకు ఎన్నో అంశాల్లో జట్టులో లోపాలు కనపడుతున్నాయి. కెప్టెన్ గా సీనియర్లు ఉన్న సమయంలో గిల్ ను ఎంపిక చేయడం కొంప ముంచిన నిర్ణయంగా మొదటి టెస్ట్ తర్వాత స్పష్టంగా అర్ధమైంది. అతనిలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే సామర్ధ్యం కనపడలేదు. 27 ఏళ్ళ తర్వాత శ్రీలంకలో వన్డే సీరీస్ ఓడిపోయింది భారత్.
న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ లో తొలిసారి ఇండియా.. వైట్ వాష్ ఎదుర్కొనే పరిస్థితి. 10 ఏళ్ళ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఓడిపోయింది. 370 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక భారత్ చేతులు ఎత్తేయడం ఆశ్చర్యపరిచిన అంశంగా చెప్పాలి. అసలు జట్టు ఎంపికలో చేసిన తప్పులు మరింత నాశనం చేసాయి. ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ను బౌలింగ్ లో ఎంపిక చేయడం విస్మయానికి గురి చేసింది. అర్షదీప్ సింగ్(Arshadeep singh) ను ఎందుకు పక్కన పెట్టారో తెలియని పరిస్థితి. కోచ్ నియంతగా వ్యవహరించడమే జట్టు కొంప ముంచిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.