Gautam Gambhir: గంభీర్ కు గుడ్ బై..? బోర్డు కీలక నిర్ణయం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI).. టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో సీరియస్ గా ఉందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ తర్వాత కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించే విషయంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి, న్యూజిలాండ్ తో వైట్ వాష్ భారత్ పరువు తీసాయి. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓడిపోయింది.
ఇక స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన సరే ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు మొదటి టెస్ట్ లో ఓడిపోవడాన్ని బోర్డు పెద్దలు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. భారీ లక్ష్యం నిర్దేశించిన తర్వాత కూడా బౌలర్ లు విఫలం కావడం ఒక కారణమైతే, జట్టు ఎంపిక విషయంలో గంభీర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు విజయ అవకాశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్లో కోచ్ కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు.
జట్టు వ్యూహాలను పక్కాగా మైదానాల్లో అమలు చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. మొదటి టెస్ట్ లో ఇది కచ్చితంగా లోపించింది అని చెప్పాలి. దానికి తోడు కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా గంభీర్ విషయంలో అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ద్రావిడ్ తర్వాత దక్షిణాదికి చెందిన ఓ మాజీ ఆటగాడిని కోచ్ గా కోరిన భారత ఆటగాళ్లు గంభీర్ ను వద్దని చెప్పినట్లు ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) రిటైర్ అవ్వడం వెనుక కూడా గంభీర్ పాత్ర ఉందనేది అభిమానుల ఆరోపణ.
ఇక ఇంగ్లాండ్ పర్యటనలో గనుక భారత్ ఓడిపోతే ముందు వేటు గంభీర్ పైనే పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది టెస్టులు జరగగా భారత్ అందులో ఒకటి మాత్రమే విజయం సాధించింది. ఒక టెస్ట్ డ్రా కాగా ఏడు టెస్టులు ఓడిపోయింది. జట్టు ఫీల్డింగ్ తో పాటుగా బ్యాటింగ్ వైఫల్యాలు కూడా ఇటీవల కాస్త కోచ్ పై ఆరోపణలు పెంచాయి. బౌలింగ్ విభాగంలో కూడా సమర్థవంతమైన బౌలర్లను గంభీర్ వినియోగించుకోవడం లేదనేది కూడా వినపడుతున్న ఆరోపణ.