Trump: పాపం ట్రంప్.. అగ్రరాజ్యాధినేత మాటకు విలువేది..?

ఆయన అగ్రరాజ్యాధినేత.. ఒక్క మాట చెబితే చాలు ప్రపంచదేశాలు జీ హుజూర్ అంటాయి. ఆయనను ఓసారి కలిసి, తమ దేశానికి సాయం చేయాలని కోరుకుంటాయి. అలాంటిది అమెరికా అధ్యక్ష పదవి గతంలో ఎందరో అతిరథమహారధులు.. ఆపదవిని అధిష్టించారు. అంతేకాదు.. ఆపదవికి తమదైన పాలన, ఆలోచనలతో వన్నెతెచ్చారు. అంతేకాదు… ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రపంచ అత్యుత్తమ నేతల్లో ఒకరిగా నిలిచారు కూడా. కానీ ఇప్పుడున్న అధ్యక్షుడు ట్రంప్ (Trump) పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.
మొన్నటి ఎన్నికల్లో కమలా హారిస్ పై రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసి ట్రంప్ గెలిచారు. ప్రజలు చక్కని మెజార్టీ ఇచ్చారు. కానీ ఎన్నికైన తర్వాత ట్రంప్ లోని వ్యాపార వేత్త బయటకు వస్తున్నాడు. ప్రతీ దేశంతోనూ దౌత్య సంబంధాల కంటే వ్యాపార సంబంధాల కోణంలోనే ముందుకెళ్తున్నారు ట్రంప్. ఫలితంగా ఆయా దేశాలు కూడా ట్రంప్ ను.. ఓఅధ్యక్షుడిగా చూడడం కన్నా.. కేవలం వ్యాపారవేత్తగానే చూస్తున్నాయి.. దీంతో తాను అన్నిటికన్నా అధికుడిని అనుకునే ట్రంప్ కు పెద్ద చిక్కొచ్చి పడింది.
మొన్నటికి మొన్న పాకిస్తాన్ (Pakistan), ఇండియా (India) మధ్య ఒప్పందం కుదిర్చానన్నారు. తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్నారు ట్రంప్. తనకు నోబెల్ పీస్ ప్రైజ్ రావాల్సి ఉందన్నారు.అయితే తనకు రాదేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు కూడా. లేటెస్టుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేశామన్నారు. 24 గంటల్లో సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ పరిణామాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా తిలకించాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాలు సైతం.. ట్రంప్ వైపు ఆసక్తిగా చూశాయి. ఇప్పుడు ఇది ఉత్తుత్తిదే అంటోంది ఇరాన్. తామెలాంటి ఒప్పందం చేసుకోలేదంటోంది.
ఇప్పుడు.. ప్రపంచం ముందు ట్రంప్ మరోసారి చిన్నబోయారు. తన మాట చెల్లడం కాదు కదా.. ఎవరూ ఆలకించడం లేదన్న సంగతి ట్రంప్ కు అర్థమవుతుంది. ఎందుకంటే.. ఓ దేశం అమెరికా మాట వినాలంటే.. ఆదేశంతో అమెరికాకు మంచి సంబంధాలుండాలి. కేవలం బలాన్ని చూపి బెదిరించి, దారికి తెచ్చుకోవడం వీలుకాదన్న సంగతిని ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తెరగాల్సి ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు. లేదంటే ట్రంప్.. ఈసారి ప్రపంచం ముందు పిట్టల దొరలా నిలిచిపోావాల్సి వస్తుందని సెటైర్ వేస్తున్నారు.