China : ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు ..అమెరికాకు చైనా వార్నింగ్

బౌద్ధ మత గురువు దలైలామా వారసుడి ఎంపికపై తీవ్రస్థాయి చర్చ జరుగుతున్న క్రమంలో టిబెట్ విషయం లో అమెరికా (America) జోక్యం చేసుకోవడాన్ని చైనా (China) తప్పుబట్టింది. దలైలామా (Dalai Lama) 90వ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio)ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టిబెట్‌కు నాయకుడిగా ప్రపంచంలో ఐక్యత, శాంతి, కరుణను ప్రచారం చేస్తున్నందుకు ప్రశంసించారు. టిబెట్ ప్రజలకు తమ ఆధ్యాత్మిక నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ , మతపరమైన గుర్తింపు కాపాడుకునే హక్కు ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై చైనా మండిపడిరది. దలైలామా మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు టిబెట్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే, ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే హక్కు లేదు. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం తగదు. ఇది ఒక సున్నితమైన అంశమని గుర్తుంచుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ (Mao Ning) పేర్కొన్నారు.