BCCI: మేము వచ్చేది లేదు, పాక్ కు భారత్ మరో షాక్

భారత్(India) – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో, ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదని భారత్ చెప్తూ వస్తోంది. మెగా టోర్నీలు జరిగిన సమయంలో కూడా తాము పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ తరుణంలో త్వరలో జరగబోయే ఆసియా కప్(Asia Cup) ప్రశ్నార్ధకంగా మారింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సర్వసభ్య సమావేశం ఢాకాలో జరిగే అవకాశాలు కనపడుతున్నాయి.
అక్కడ పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టే ఉద్దేశం ఉంటె మాత్రం ఆ సమావేశాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) బహిష్కరిస్తుందని జాతీయ మీడియా వెల్లడించింది. టి20 ఫార్మాట్‌లో జరిగే ఆరు జట్ల ఆసియా కప్ టోర్నమెంట్ విషయంలో భారత్ నిర్ణయంపై మిగిలిన దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది మరియు. అయితే ఇప్పటి వరకు టోర్నమెంట్ షెడ్యూల్ లేదా వేదికను ప్రకటించలేదు. టోర్నమెంట్ ను సెప్టెంబర్ లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఈ సమావేశానికి భారత్ హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. ఈ సమావేశం జూలై 24న ఢాకాలో జరగనుంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి కారణంగా, ఈ సమావేశానికి వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. ఇటీవల ఇండియా, బంగ్లాదేశ్ మధ్య వన్డే సీరీస్ జరగాల్సి ఉండగా.. ఆ మ్యాచ్ లను 2025 ఆగస్టు నుండి 2026 సెప్టెంబర్ వరకు వాయిదా వేయాలని రెండు దేశాల క్రికెట్ బోర్డ్ లు నిర్ణయించాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. భారత్ ఈ సమావేశంలో పాల్గొనే విధంగా ఆయన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.
ఆసియా కప్ సమావేశ వేదిక ఢాకా నుండి మారితేనే జరుగుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఆసియా కప్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్. 2023లో, ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత్ నిరాకరించింది. దీనితో భారత్ మ్యాచ్ లకు శ్రీలంకను తటస్థ వేదికగా ఎంపిక చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. కానీ భారత్ సరిహద్దు దాటడానికి నిరాకరించింది. దీనితో భారత్ మ్యాచ్ లను దుబాయ్‌లో నిర్వహించారు.