Operation Sindoor: నిషేధించిన పాక్ ఛానెళ్లు, సెలెబ్రిటీ ఖాతాలు భారత్‌లో మళ్లీ ప్రత్యక్షం!

పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకూడదనే ఆలోచనతో భారతదేశం నిషేధించిన పాకిస్తాన్‌కు (Pakistan) చెందిన యూట్యూబ్ ఛానెళ్లు, వార్తా సంస్థలు, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు బుధవారం నాడు అనూహ్యంగా భారత్‌లో మళ్ళీ ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. ఈ నిషేధిత జాబితాలో ఉన్న సాబా కమర్, అహద్ రజా మిర్, హనియా మిర్ వంటి ప్రముఖ పాక్ సెలెబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు కూడా ఇప్పుడు భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, పలు పాకిస్తానీ వార్తా ఛానెళ్లు కూడా యూట్యూబ్‌లో మళ్లీ కనిపించడంతో.. పాక్ (Pakistan) ఛానెళ్లు, సెలెబ్రిటీలపై భారత్ విధించిన నిషేధం ఎత్తేసిందా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఈ ఛానెళ్లు, సోషల్ మీడియా ఖాతాలు మళ్లీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన నేపథ్యంలో కేంద్రం త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.