Shubhanshu Shukla: యాక్సియం-4 మిషన్ సక్సెస్.. భూమిపైకి సురక్షితంగా శుభాంశు శుక్లా..

యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. రోదసిలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం.. మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం-4 కమాండర్ పెగ్గీ విట్సన్ తెలిపారు.
స్వస్థలంలో సంబరాలు..
మరోవైపు యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లఖ్‌నవూలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
కోట్లాది మందికి స్ఫూర్తి – మోడీ
శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోడీ (Modi) హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు.. పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టిన యాక్సియం-4 మిషన్ బృందం.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో సోమవారం బయలుదేరింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ, టిబర్ కపులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.