AK 203 Rifles: రైఫిల్స్ కా బాప్.. భారత్ చేతిలో షేర్..!

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్.. తన రక్షణ పాటవాన్ని పెంపొందించుకుంటోంది. మరీ ముఖ్యంగా పహల్గాం దాడి తర్వాత సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ కు చైనా సాంకేతిక, రక్షణ సాయం చేసింది. దీంతో పొరుగుదేశాలన్నింటినీ కలిసి ఒక్కసారిగా ఎదుర్కొని విజయం సాధించామని భారత ఆర్మీ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ రక్షణ వ్యవస్థ మరింత అబేధ్యంగా ఉండాలని కేంద్రం భావిస్తోంది. దీనిలో భాగంగా సైన్యానికి ఎప్పటికప్పుడు అత్యుత్తమ ఆయుధాలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా సరిహద్దుల్లో కాపలా కాసే ఫ్రంట్ లైన్ కు.. సరైన ఆయుధాలు అవసరం. ఎందుకంటే ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే పాక్ సైన్యం, ఉగ్రవాదులు.. భారత్ కు చికాకులు కలిగిస్తున్నారు. అందుకనే వారి పీచమణచడం కోసం.. కలాష్నీకోసం సిరీస్ లో అత్యాధునికమైన ఏకే-203 రైఫిళ్లు (AK-203 Rifle) అనుకున్న సమయానికంటే ముందే ఆర్మీకి అందనున్నాయి. నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం ఈ రైఫిల్ సొంతం. అలాగే ఇది 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలుగుతుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో భారత్-రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారుచేస్తోంది. వాస్తవానికి రూ.5,200 కోట్ల కాంట్రాక్టులో భాగంగా 2032 అక్టోబరు నాటికి 6,01,427 ఏకే 203 రైఫిళ్లను అందజేయాల్సి ఉంది. కానీ, అనుకున్న సమయానికి 22 నెలల ముందు అంటే 2030 నాటికే వీటిని భద్రతా దళాలకు ఇచ్చేస్తామని ఐఆర్‌ఆర్‌పీఎల్ సీఈఓ ఎస్.కె.శర్మ తాజాగా వెల్లడించారు. ‘‘ఇప్పటికే దాదాపు 48 వేల రైఫిళ్లను ఇచ్చేశాం. రెండు నుంచి మూడు వారాల్లోగా మరో 7 వేల రైఫిళ్లు అందజేస్తాం. డిసెంబరు నాటికి 15 వేల రైఫిళ్లు అదనంగా ఇస్తాం’’ అని ఆయన వెల్లడించారు.
ఏకే-47, ఏకే-57తో పోల్చుకుంటే ఈ ‘షేర్’ తుపాకీలు అత్యాధునికమైనవి. కలాష్నికోవ్ సిరీస్‌లో ప్రమాదకరమైనవి కూడా. కొన్ని దశాబ్దాలుగా సాయుధ దళాలు ప్రముఖంగా వినియోగించే ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఆర్మీ వీటి వినియోగం పెంచనుంది. ఇన్సాస్ రైఫిల్ కాలిబర్ 5.62 ఎంఎం కాగా..7.62 ఎంఎం కాలిబర్‌తో వీటిని రూపకల్పన చేశారు. ఇక ఈ తుపాకీ బరువు 3.8 కేజీలు కాగా.. ఇన్సాస్ 4.15 కేజీల బరువుంటుంది. పొడవు కూడా తక్కువే. షేర్ పొడవు 705ఎంఎంగా ఉంది. సరిహద్దుల్లో మరీ ముఖ్యంగా నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి పహారా కాస్తున్న మన సైనికుల చేతికి ఇవి అందితే.. మన బలగాల పోరాట సామర్థ్యం బలోపేతం కానుందని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.