Ind vs Eng: కొంప ముంచిన ఆల్ రౌండర్ లు, రెండో టెస్ట్ లో అయినా..?

సేనా మైదానాలు.. అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా(Australia).. ఈ నాలుగు దేశాల్లో క్రికెట్ ఆడటం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఆసియా ప్రాంతానికి చెందిన జట్లు అక్కడ ప్రభావం చూపించడం అనేది చాలా కష్టం. చలి వాతావరణం, గాలి.. వర్షం ఇలా ఎన్నో అక్కడ ప్రభావం చూపే అంశాలు. అసలు పిచ్ ఎలా ప్రభావం చూపిస్తుందో అర్ధం కాని పరిస్థితి అక్కడ. ఇలాంటి దేశాల్లో ఆల్ రౌండర్ లే మ్యాచ్ విన్నర్లు. సౌత్ ఆఫ్రికా నుంచి కల్లిస్ అయినా.. ఇంగ్లాండ్ నుంచి ఫ్లింటాఫ్ అయినా.. న్యూజిలాండ్ నుంచి వెట్టోరి అయినా, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్ళు అయినా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళే.
కాని భారత్(India) కు మాత్రం కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయి ఉన్న ఆటగాడు మాత్రం దొరకలేదు అనే చెప్పాలి. గత ఏడాది చివర్లో జరిగిన ఆస్ట్రేలియా సీరీస్ అయినా ఇప్పుడు జరుగుతోన్న ఇంగ్లాండ్ సీరీస్ అయినా సరే.. ఇదే ప్రధానంగా కొంప ముంచిన విషయంగా చెప్పాలి. స్పిన్ ఆల్ రౌండర్ గా జడేజా(Jadeja), సీం ఆల్ రౌండర్ గా శార్దుల్ ఠాకూర్ వచ్చినా ఏ రూపంలో కూడా ఈ ఇద్దరు జట్టులో ఉపయోగపడలేదు. జడేజా కేవలం ఒక్కటే వికెట్ తీసి.. జట్టుకు ఉపయోగపడే పరుగులు చేయలేదు. శార్దుల్ ఠాకూర్ పరిస్థితి కూడా అంతే.
అందుకే రెండో టెస్ట్ లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు అభిమానులు. జడేజా స్థానంలో.. వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటే బ్యాటింగ్ లో కనీసం 30 నుంచి 40 పరుగులు చేస్తాడు. ఇక శార్దుల్ ఠాకూర్(Shardhul Thakur) స్థానంలో నితీష్ కుమార్ ను తీసుకుంటే కనీసం బ్యాటింగ్ లో అయినా ప్రభావం చూపిస్తాడు అంటున్నారు అభిమానులు. ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ ప్రభావం చూపిస్తే మన లోయర్ ఆర్డర్ మాత్రం కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయింది. మరి రెండో టెస్ట్ లో అయినా మారుతుందా లేదా చూడాలి.