Indian Army: ఆకాష్ ప్రైమ్, లడఖ్ సరిహద్దుల్లో దుమ్ము రేపిన ఇండియన్ ఆర్మీ

సరిహద్దు దేశాల నుంచి ఎదురయ్యే ఏ ముప్పును అయినా ఎదుర్కొనేందుకు భారత్ సిద్దమవుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని తన అమ్ములపొదిలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఓ బలమైన క్షిపణిని ప్రయోగించి తన సత్తా చాటింది భారత్. అసలేంటి ఆ క్షిపణి అనేది ఈ స్టోరీలో చూద్దాం. లడఖ్‌లో 15,000 అడుగుల ఎత్తులో, సైన్యం ఆకాశ్ ప్రైమ్(Akash Prime) అనే క్షిపణిని ప్రయోగించింది. ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి ఇది.
క్షిపణి ప్రయోగాలలో ఇది ఓ మైలురాయిగా చెప్తోంది రక్షణ శాఖ. ఆకాశ్ ప్రైమ్ ను పరిక్షించగా.. రెండు టార్గెట్స్ ను ఈ క్షిపణి చేధించింది. ఆకాష్ ప్రైమ్ అనేది ఆకాష్ మార్క్ 1, మార్క్-1ల యొక్క కొత్త మోడల్. ఆకాష్ ను ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(operation Sindoor) లో వినియోగించారు. ప్రైమ్ వేరియంట్ రెండు హై-స్పీడ్ మానవరహిత వైమానిక లక్ష్యాలను ధ్వంసం చేసిందని ఆర్మీ తెలిపింది. ఎత్తైన ప్రదేశాల్లో సైతం ఈ క్షిపణిని ప్రయోగించే విధంగా అభివృద్ధి చేసారు.
4,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో వీటిని ఉపయోగించవచ్చు. వీటిలో దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉంది. ఇది రేడియో సిగ్నల్‌లను కిరణాలుగా ప్రసారం చేస్తుంది. లక్ష్యాలను ట్రాక్ చేయడానికి, నాశనం చేయడానికి చివరి దశలో వాటిని ఉపయోగిస్తుంది. ఆకాశ్ అనేది 20 కి.మీ పరిధి కలిగిన ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ. డీఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు 15 సంవత్సరాల క్రితం ఈ క్షిపణిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
మొత్తం వ్యవస్థను మొబైల్ ప్లాట్‌ఫామ్‌లపై కాన్ఫిగర్ చేసి వినియోగించవచ్చు. ఈ క్షిపణులు సుమారు 20 అడుగుల పొడవు మరియు 710 కిలోల బరువు ఉంటాయి. ప్రతి క్షిపణి 60 కిలోల వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. ప్రతి లాంచర్ మూడు క్షిపణులను కలిగి ఉంటుంది. ఇవి ‘ఫైర్ అండ్ ఫర్గాట్’ మోడ్‌లో పనిచేస్తాయి.