Saudi Arabia : ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది భారతీయుల మృతి
సౌదీ అరేబియా (Saudi Arabia )పశ్చిమ ప్రాంతంలో జిజాన్ (Jizan) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు జెడ్డా (Jeddah) లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్‌లోని అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని, వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఏయే ప్రాంతాలకు చెందినవారనే వివరాలు మాత్రం తెలియలేదు. బాధిత కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) పూర్తి సహకారం అందిస్తోంది. భారత్‌లోని అధికారులు, బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మరిన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు 8002440003 (టోల్ ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301 (వాట్సాప్) ఏర్పాటు చేశాం అని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.






