కరోనా బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ!
కరోనా బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతుండటం వెనుక దాగి ఉన్న గుట్టును శాస్త్రవేత్తలు ఛేధించారు. వైరస్ బారిన పడ్డ తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తుండటమే ఇందుకు కారణమని తేల్చారు. కరోనా మహమ్మారి లింగ భేదాన్ని చూపుతున్నట్లు పలు అధ్యయనాలు ఇప్పటికే గుర్తించాయి. అయితే, అందుకు కారణమేంటన్నది మాత్రం ఇన్నాళ్లూ బయటపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం 18ఏళ్లకు పైబడిన 98 మంది కరోనా బాధితులపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించింది. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకర కణాలను అంతమొందించడంలో రోగ నిరోధక వ్యవస్థలోని టి-కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. వైరస్ సోకిన తర్వాత పురుషుతో పొలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదలవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.






