Dallas: డల్లాస్ లో జరిగిందని మీడియా కు వచ్చిన తెలుగు వ్యక్తుల బ్లాక్ మెయిల్ లో నిజమెంత?
 
                                    
డల్లాస్ నగరం లో ఇద్దరు తెలుగు వ్యక్తులు దేశీ చౌరస్తా అనే సూపర్ మార్కెట్ ( అది కూడా తెలుగు వారు నడుపుతున్నదే !) బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తూనికలు – కొలతల అధికారులమని చెప్తూ $100,000 డిమాండ్ చేస్తున్నారని డిసెంబర్ 30 న వచ్చిన కధనాలు దాదాపు అన్ని ప్రింట్ అండ్ టీవీ ఛానెళ్ల లో రావటం మనం చదివాం / చూసాం. ఈ కధనం మొత్తం దేశీ చౌరస్తా వారు చేసిన వీడియో ( మనం స్టింగ్ ఆపరేషన్ అనుకోవచ్చు ) ద్వారా తెలుస్తోంది. ఆ కథనం కూడా చౌరస్తా వారు వీడియో తో పాటు ఇచ్చిన ఇచ్చిన ప్రెస్ నోట్ ద్వారా వచ్చిందే! ఆ ప్రెస్ నోట్ + వీడియో ప్రకారం అన్ని మీడియా సంస్థలు ఆ న్యూస్ ని ప్రముఖంగా ప్రచురించాయి / టెలికాస్ట్ చేశాయి.
అయితే ఆ స్టోరీ పూర్తి గా నిజమేనా? ఆ తెలుగు వ్యక్తులు ఇంకో తెలుగు వ్యక్తి నడుపుతున్న బిజినెస్ ప్లేస్ కి వెళ్లి $100000 అడిగే ధైర్యం ఎలా వచ్చింది? అంతకు ముందు ఆ రెండు వర్గాల మధ్య ఏదైనా బిజినెస్ సంబంధం ఉన్నదా? లేదా ఏదైనా పాత గొడవలు, తగాదాలు ఉన్నాయా? ఇలాంటి అనుమానాలు రావడం సహజమే!
వచ్చిన అధారాలు పట్టి మీడియా సంస్థలు ఆ వార్తలు ప్రచురించడం తప్పు కాదు. అందరి లాగే తెలుగు టైమ్స్ కూడా ఈ వార్త ను ప్రచురించడం, ఆ సంఘటన కి చెందిన వ్యక్తులు, తెలుగు టైమ్స్ ని కాంటాక్ట్ చేసి మీడియా లో వచ్చిన కథనానికి వెనుక జరిగిన అనేక విషయాలు వెల్లడించడం , వాటి ఆధారాలు కూడా పంపడం జరిగింది. సేకరించిన విషయాలు, వచ్చిన ఆధారాలు బట్టి రెండు వర్గాల మధ్య బిజినెస్ గొడవలు ఉన్నాయని, ఇవి రెండు భిన్నమైన కేసు ల వ్యవహారంగా తెలుస్తోంది.
కేసు 1. రోహిత్ ఉప్పాల దేశీ చౌరస్తా లో భాగస్వామ్యం కోరడం:
శరత్ పొద్దుటూరి అమెరికాలోని డల్లాస్ లో దేశీ చౌరస్తా సూపర్ మార్కెట్ ని విజయవంతం గా నడుపుతున్న సమయం లో (2022 లో ) రోహిత్ ఉప్పాల కూడా ఆ బిజినెస్ లో భాగస్వామ్యం కావాలని అనుకోవడం ఇద్దరు కలిసి చర్చించుకోవడం జరిగింది. బిజినెస్ లో చేరటానికి పార్ట్నర్ పద్దతి లేదా ఇన్వెస్టర్ పద్దతి ఉన్నాయని చెప్పడం , 25% షేర్ కోసం $500000 కట్టాలని ఇద్దరి మధ్య ఒక అవగాహన కూడా వచ్చింది. ఆ ప్రకారం రోహిత్ ఉప్పాల బ్యాంక్ ఆఫ్ అమెరికా ద్వారా 28 నవంబర్ 2022 న $230,000 , ఆ తరువాత 10 జనవరి 2023 న $70000 చెల్లిచటం జరిగింది ( బ్యాంకు పేమెంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము ) అయితే చౌరస్తా లో భాగస్వామ్యం వద్దు , ఇన్వెస్టర్ పద్దతి లో $500000 పెట్టుబడి కి $18000 ఇస్తానని శరత్ పొద్దుటూరి చెప్పడం, ఆ తర్వాత వివిధ కారణాల వలన వారిరువురు విడిపోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపు 7 నెలల తరువాత సెప్టెంబర్ 2023 లో శరత్ పొద్దుటూరి తీసుకొన్న $300000 తిరిగి ఇచ్చేయడం కూడా జరిగింది. ఆ సమయం లో ఇంత పెద్ద మొత్తం బిజినెస్ లో ఉంచుకొన్నందుకు ఇన్వెస్టర్ పద్దతి లో దాదాపు $70000 వరకు రావాల్సి ఉందని రోహిత్ చెప్పడం దానికి శరత్ అంగీకరించడం కూడా జరిగింది.
దేశీ చౌరస్తా సూపర్ మార్కెట్ డల్లాస్ లో మరో రెండు చోట్ల పెట్టడం కూడా జరిగినా రోహిత్ కి రావాల్సిన $70000 రాక పోవడం, తరచూ రోహిత్ తన పేమెంట్ కోసం శరత్ తో ఫాలో అప్ చేయడం జరుగుతూ వుంది. ఈ విషయం లో రోహిత్ తన డబ్బులు వెంటనే ఇవ్వమని ఇమెయిల్స్ కూడా పంపడం జరిగింది.
కేసు 2- దేశీ చౌరస్తా లో తూనికలలో తేడాలు
దిలీప్ నారెడ్ల అనే ఇంకో తెలుగు వ్యక్తి దేశి చౌరస్తాలో 25 December 2024 న చికెన్ కొనుక్కొని ఇంటికి వెళ్ళాక బరువు లో తక్కువ వున్న విషయం గమనించి రోహిత్ ఉప్పల తో చెప్పడం , వారిద్దరూ కలిసి ఇంకో ప్రాంతం లో వున్న దేశీ చౌరస్తా లో కూడా అదే విధంగా ఉన్నదని నిర్ధారణ చేసుకొని, ఒక బరువు కొలిచే Weighing scale తీసుకొని దేశీ చౌరస్తా లో అన్ని పదార్థాల ను తూనిక చేసి ప్రయత్నం చేయడం, అప్పుడు దేశీ చౌరస్తా లో వున్న వినీల్ వారిద్దరిని బయటకు నెట్టేయడం జరిగింది. రోహిత్ వెంటనే 911 కి ఫోన్ చేసి పోలీస్ ( Cops ) పిలవడం, కాప్స్ వచ్చి పరిస్థితి ని అర్ధం చేసుకోవడానికి ప్రాధమిక విచారణ చెయ్యడం జరిగింది. ఆ సమయం లో పోలీస్ లు అడిగినపుడు దేశీ చౌరాస్తా నుంచి వినిల్ కొన్ని వస్తువుల విషయంలో తక్కువ తూనిక రావడం నిజమే అని ఒప్పుకోవడం పోలీసుల కెమెరా లో రికార్డు అయ్యిందని కూడా తెలుస్తోంది.
పైన వివరించిన రెండు కేసుల ముగింపు
రోహిత్ ఉప్పాల చెప్పిన కధనం ప్రకారం ఈ విషయం మరింత పెరిగే అవకాశం వుంది అని గ్రహించిన శరత్ పొద్దుటూరి తనను చర్చలకు పిలిచాడని , తనకి రావాల్సిన $70000 తో కలిపి మొత్తం $100000 ఇస్తానని, చౌరస్తాలో తూనికలు చేస్తూ తీసిన వీడియో లు ఇచ్చేయాలని ప్రతిపాదన చేసాడని తెలుస్తోంది. ఆ ప్రతిపాదన మేరకు తాము చౌరస్తాకు వెళ్లామని , మేము Weights & Mesure officers అని చెప్పి బ్లాక్ మెయిల్ చెయ్యడం పూర్తి గా కల్పితం అని రోహిత్ చెపుతున్నారు. అలాగే తనని పోలీస్ లు అరెస్ట్ చేశారని మీడియా లో వచ్చిన విషయం కూడా తప్పే నని, తనని అరెస్ట్ చేయ లేదని రోహిత్ తెలిపారు.
రోహిత్ ఉప్పాల చెప్పిన విషయం లో ఆధారాలు బట్టి ఇంతకు మునుపే $300000 ఇచ్చిన విషయం, తద్వారా ఇరువురికి వ్యాపార సంబంధాలు వున్నాయని అర్ధం అవుతోంది. అలాగే బ్లాక్ మెయిల్ వ్యవహారం బయటకు రాక మునుపే దేశీ చౌరస్తా దగ్గర గొడవ అయిన సంగతి, రోహిత్ ఉప్పాల వర్గం పోలీస్ లను పిలిచిన సంగతి , పోలీసులు చౌరస్తా లో ఇద్దరికీ టికెట్డా కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఈ వివరాల వలన, రోహిత్ పేమెంట్ ఆధారాల వలన వారు చెప్పే విషయం లో కొంత నిజం వున్నదని కూడా అర్ధం అవుతోంది. తెలుగు టైమ్స్ కి వచ్చిన ఆధారాలు ( 25 డిసెంబర్ న దేశీ చౌరస్తా లో దినేష్ , రోహిత్ లు కలిసి కొన్ని వస్తువుల బరువులు తణిఖీ చేస్తున్న వీడియో, దేశి చౌరస్తా బిల్స్ కి , ఇతర సూపర్ మార్కెట్ లో కొన్న వస్తువుల బిల్స్ కి వున్నా తేడాల వివరాలు, రోహిత్ ఉప్పాల దేశి చౌరాస్తా కి $300000 చెల్లించిన వివరాలు ) వున్నాయి. వీటి వలన పూర్తి నిజం తెలియక పోవచ్చు. శరత్ ఉప్పుటూరి దగ్గర రెండో వైపు వివరాలు ఉండవచ్చు కూడా. అయితే ఇక్కడ తెలుగు టైమ్స్ కేవలం వివరాలను బట్టి ఇంతకూ క్రితం మీడియా లో వచ్చిన కధనం పూర్తి గా నిజం కాదు అని నమ్ముతూ ఈ న్యూస్ ప్రచురిస్తోంది.
వ్యాపార సంబంధ విషయాలలో తేడాలు రావడం సహజమే! ఇరు వర్గాలు తెలుగు వారు, కష్టపడి బిజినెస్ లో రాణించాలని ముందుకెళ్తున్న వారు కనుక ఇరు వర్గాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించు కోవాలని , అవసరం అయితే తెలుగు పెద్దల సహకారం తీసుకోవాలని, పోలీసులు , కోర్టు లు లేకుండా, మీడియా ద్వారా మరింత అల్లరి కాకుండా తేల్చుకోవాలని కోరుతున్నాం.











