Winter Clothes : అమెరికాలో పేద విద్యార్థులకు ఉచితంగా చలికోట్లు పంచిన ఎన్నారై సంస్థలు
 
                                    అమెరికాలో సరైన ఆదాయం లేని కుటుంబాల పిల్లలకు అండగా నిలిచేందుకు సువిధ ఇంటర్నేషనల్, రోటరీ ఈ-క్లబ్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ హెల్త్ అండ్ వెల్నెస్, రోటరీ క్లబ్ ఆఫ్ రాంచో కార్డోవా నడుంబిగించాయి. ఈ మూడు సంస్థలు కలిసి 500 జాకెట్లు, స్వెటర్లు వంటి చలికాలం వేసుకునే దుస్తులను (Winter Clothes) సేకరించి, ఆదాయం తక్కువగా ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు అందజేశాయి. ప్రస్తుతం అమెరికాలో మంచు తుఫాను కమ్మేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, అందునా చిన్నారులు ఈ చలికి తట్టుకోలేక నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకే ఈ మూడు స్వచ్ఛంద సంస్థలు చేతులు కలిపాయి. రాంచో కార్డోవాలోని కిన్నీ హై స్కూల్లో చదువుకుంటున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు వింటర్ క్లోతింగ్ను (Winter Clothes) అందజేశాయి. మొత్తం 200 మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు ఈ వింటర్ వస్త్రాలు ఉపయోగపడనున్నాయి. వచ్చే రోజుల్లో చలి మరింత పెరగనున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ చలికాలం దుస్తులు దొరకడం ఆ పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందనే చెప్పాలి.
రాంచో కార్డోవాలోని రోటరీ క్లబ్ ఈ పని ప్రారంభించగా.. సిటీ మేయర్ సిరి పులిపాటి కోరిక మేరకు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కూడా దీనిలో పాలుపంచుకుంది. దీంతో చలికాలం ధరించే వస్త్రాలను (Winter Clothes) సేకరించడం వేగవంతమైంది. వారికి రోటరీ ఈ-క్లబ్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ కూడా ఎంతో సహకారం అందించింది. మొదట కేవలం 100 జాకెట్స్ మాత్రమే సేకరించడం టార్గెట్గా ఈ క్యాంపెయిన్ ప్రారంభమైందని, రోటరీ ఈ క్లబ్ చేరికతో ఈ సంఖ్య 500కు పెరిగిందని సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ వేంపటి కొనియాడారు. అలాగే ఈ పని కోసం ఎంతో కృషి చేసిన 22 మంది యువ వాలంటీర్లను పేరుపేరునా అభినందించారు. రోటరీ ఈ క్లబ్ సభ్యురాలు ప్రాచీ రైచురా కూడా వాలంటీర్ల కృషిని మెచ్చుకున్నారు.











