MATA: ఘనంగా ముగిసిన మాటా సేవా డేస్.. నేడు రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే
హైదరాబాద్: సేవా కార్యక్రమాలే లక్ష్యంగా గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టిన మన అమెరికా తెలుగు సంఘం (MATA), తన సేవా యజ్ఞం ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనుంది. నవంబర్ 11న ప్రారంభమైన మాతా సేవా డేస్ (MATA SEVA DAYS) వేడుకలు నేడు, జనవరి 9న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి.
కార్యక్రమ ముఖ్యాంశాలు
ఈ వేడుకలో భాగంగా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా, సమాజానికి ఉపయోగపడే పలు కీలక అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
- అమెరికన్ విద్య, ఉపాధి అవకాశాలు – ఎదురయ్యే సవాళ్లపై సెమినార్.
- ప్రథమ చికిత్స, సీపీఆర్ (CPR) శిక్షణ.
- రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన.
అతిథుల సందడి
ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సందడి చేయనున్నారు. సీనియర్ నటుడు సుమన్ తల్వార్, హీరోలు ఆది సాయికుమార్, రాజ్ తరుణ్, నటి పాయల్ రాజ్పుత్, దర్శకులు వీరభద్ర చౌదరి, అబ్బాయి ఫేమ్ అధిరే అభి, రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గాయకులు రామచారి కొమండూరి, డాక్టర్ లింగ శ్రీనివాస్ సంగీత సారథ్యంలో ఈ సాయంత్రం ఆహ్లాదకరంగా సాగనుంది.
మాటా రెండో మహాసభలు
ఈ సందర్భంగా మాటా (MATA) తమ తదుపరి భారీ ఈవెంట్ గురించి కూడా ప్రకటించింది. జూన్ 19, 20 తేదీల్లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో మాటా రెండో కన్వెన్షన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమాలను విజయవంతం చేసిన కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సమల, కిరణ్ దుడ్డగి, ఇతర సభ్యులకు సంఘం కృతజ్ఞతలు తెలిపింది.






