బాటా ఉగాది వేడుకలు సూపర్…

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఏప్రిల్ 1వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించిన ఉగాది సంబరాలు అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకలను తిలకించడానికి 1500మందికిపైగా శ్రోతలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు యూత్ టాలెంట్ షో, ధీమ్ తానా (డ్యాన్సింగ్, సింగింగ్, స్పెషల్ టాలెంట్ పోటీలు) ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు ఎన్నో కార్యక్రమాలతో ఉగాది వేడుకలు సంబరంగా సాగాయి. గాయకుడు యాజిన్ నిజర్ పాడిన పాటలు హైలైట్‌గా నిలిచాయి. పలు బిజినెస్ సంస్థలు ఈ వేడుకలకు తమవంతు చేయూతను ఇచ్చాయి. రామకృష్ణ వెనుజియా సమర్పించిన ఈ కార్యక్రమానికి యు స్మైల్ డెంటల్, రవి ట్యాక్స్ సర్వీసెస్ భాగస్వామ్య స్పాన్సర్లుగా, పిఎన్‌జి జ్యూవెల్లర్స్ గ్రాండ్ స్పాన్సర్‌గా, రియల్టర్ లావణ్య దువ్వి, కేంబ్రిడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్స్, రియల్టర్ మనుఛంగోత్ర, గూగైన్ ఇంక్, కాల్ హోమ్స్, పాఠశాల, విటి ఫోర్స్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. విరిజల్లు దేశీ 1170 ఎఎం, తెలుగు టైమ్స్, టీవీ 5, వి6, హెచ్‌ఎం టీవి, ఐనా టీవి, టీవీ9 మీడియా స్పాన్సర్లుగా వ్యవహరించాయి.
వేడుకలకు పురస్కరించుకుని వేదికను అందంగా అలకరించారు. బట్టలు, నగలు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ట్యాక్స్ సర్వీసెస్‌తోపాటు ఫుడ్ సంస్థలు తమ తమ ఉత్పత్తులను వేదిక వద్ద ప్రదర్శించాయి. సంప్రదాయ ఉగాది పచ్చడిని వచ్చినవారందరికీ అందజేశారు. రిజిస్ట్రేషన్ టీమ్ సభ్యులు కొండల్, నరేష్, ప్రశాంత్, యశ్వంత్ అందరికీ ఘనంగా స్వాగతం పలికారు.
తానా నిర్వహించిన ధీమ్ తానా పోటీలకు మంచి స్పందన వచ్చింది. దాదాపు 200 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ టాలెంట్‌లను ప్రదర్శించారు. సుమంత్, అరుణ్ ఈ పోటీలను కో ఆర్డినేట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, కుపర్టినో మేయర్ సవిత వైద్యనాథన్, రో ఖన్నా ఆఫీస్ డైరెక్టర్ క్రిస్ మోయ్లాన్, కాలిఫోర్నియా అసెంబ్లీ మెంబర్ కంసెన్ చు, బాటా అడ్వయిజరీ బోర్డ్ సభ్యుడు డా. రమేష్ కొండ తదితరులు వేడుకలను చక్కగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యుడు బిల్ క్విర్క్ కూడా వేడుకలకు హాజరై బాటా టీమ్‌కు ప్రశంసాపత్రాన్ని బహూకరించారు.
బాటా అడ్వయిజర్ విజయ ఆసూరి సాయంత్రం 5.30 గంటలకు ముఖ్య అతిధులను వేదికపైకి ఆహ్వానించి ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణకు నివాళులర్పిస్తూ వీణ నాదామృతం కార్యక్రమాన్ని ప్రదర్శించారు. శివ నూపురం, ఆర్టిస్టిక్ డైరెక్టర్ శ్రీమతి సింధు సురేంద్రల ఆనందభైరవి కూచిపూడి నాట్యం అలరించింది. శ్రీలు వెలిగేటి, శ్రీదేవి పసుపులేటి, శిరీష బత్తుల, తారకదీప్తి, ఆదిత్య, సమంత్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన తూనీగ తూనీగ కార్యక్రమం ఆకట్టుకుంది. యువ తరంగాలు ఉర్రూతలూగించింది.
తెలుగు టైమ్స్, బాటా కలిసి చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులు చేసిన ప్రదర్శనలు కూడా ఎంతో అలరించాయి. పాఠశాల టీచర్లు, చిన్నారులు తెలుగు భాష గొప్పదనాన్ని తమ ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. మా బాసు పెళ్ళి హాస్యనాటిక నవ్విస్తే, సందడే సందడి ఉత్సాహాన్ని ఇచ్చేలా సాగింది. మ్యూజికల్ డ్యాన్స్ డ్రామా ‘తరంగిణి’ భళా అనిపించింది.
టాలీవుడ్ గాయకుడు యజిన్ నిజార్ పాడిన పాటలు కార్యక్రమాల్లో హైలైట్‌గా నిలిచాయి. గంటసేపు హిట్‌పాటలను పాడి అందరినీ అలరించారు. చారు శీల, శీతాకాలం, ఆపిల్ బ్యూటీ, మేఘాలు లేకున్నా…వంటి పాటలు హుషారుగా సాగాయి. ధీమ్ తానా, యూత్ టాలెంట్ షో విజేతలకు యాజిన్ నిజర్, బే ఏరియా తానా నాయకులు సతీష్ వేమూరి, వినయ్, రజనీకాంత్ బహూమతులను అందజేశారు.
ప్రసాద్ మంగిన సంపాదకత్వంలో ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక సంచికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక సంచికకు ఆర్టికల్స్‌ను, పద్యాలను, కథలను రాసినవారందరికీ, యాడ్స్‌లతో ఆర్థిక సహాయం చేసిన సంస్థలకు ప్రసాద్ మంగిన ధన్యవాదాలు చెప్పారు.
బాటా ప్రెసిడెంట్ డా. శిరీష బత్తుల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ ధన్యవాదాలను తెలియజేసింది.