ATA 2025: రవీంద్రభారతిలో కన్నులపండువగా ‘ఆటా’ వేడుకలు 2025.. తెలుగు సంస్కృతి, సేవకు పట్టాభిషేకం
- తెలుగు మూలాలను మర్చిపోవద్దు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్: తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రవాస తెలుగు సంఘాల పాత్ర వెలకట్టలేనిదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంసించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆటా వేడుకలు-2025 గ్రాండ్ ఫినాలే’ శనివారం రవీంద్రభారతి వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన గవర్నర్, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా తమ మూలాలను, మాతృభాషను మర్చిపోవద్దని పిలుపునిచ్చారు. విదేశాల్లో స్థిరపడినా భారతీయ వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఆటా చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
ప్రముఖులకు పురస్కారాలు..
ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దశాబ్దాల కాలం పాటు అద్భుతమైన చిత్రాలను అందించిన దర్శక దిగ్గజం ఎ. కోదండరామిరెడ్డిని గవర్నర్ ‘ఆటా జీవన సాఫల్య పురస్కారం’తో ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ‘ఎక్సలెన్స్ అవార్డులు’ అందజేశారు. లెజెండరీ యాక్టర్ కృష్ణం రాజు సహచరిణి శ్యామల దేవి మాట్లాడుతూ, పుట్టిన గడ్డ కోసం ఆటా చేస్తున్న సేవలను అభినందించారు. కోదండరామిరెడ్డిని సన్మానించడం ఆనందంగా ఉందని, కృష్ణం రాజు ఆశీస్సులు ఎప్పుడూ ఆటా టీంపై ఉంటాయని పేర్కొన్నారు.
పెరుగుతున్న తెలుగు ప్రాబల్యం – ఉపాధి ధ్యేయం
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, 2016 నుండి అమెరికాలో తెలుగు జనాభా నాలుగు రెట్లు పెరిగిందని, వారి శ్రేయస్సు కోసం ఆటా నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. కేవలం సంస్కృతిని కాపాడటమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ అంశాలపై నిర్వహించిన వెబినార్లకు విశేష స్పందన వచ్చిందని ఆయన వివరించారు.
మాతృభూమికి మా విజ్ఞానం అంకితం..
ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, ఆటా ప్రయాణం ఒక సేవాయాత్ర అని అభివర్ణించారు. అమెరికాలో ఉన్నత స్థానాల్లో ఉన్న తెలుగు వారి విజ్ఞానం, అనుభవం మాతృభూమి అభివృద్ధికి ఉపయోగపడాలన్నదే తమ ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. యువతలోని నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ పోటీలను కూడా నిర్వహించామని చెప్పారు.
ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’కు ఎన్నారైల మద్దతు అవసరమని, ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆటా కృషిని కొనియాడగా, ఎమ్మెల్యే మల్లా రెడ్డి తన 2003 నాటి ఆటా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నారైలు హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ గ్రాండ్ ఫినాలేలో భాగంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. గురుశ్రీలత సూరి నేతృత్వంలో ప్రాణమ్య సూరి బృందం కుచిపూడి నృత్య ప్రదర్శన, గరిణె సాయి కుమార్, గరిణె సంతోష్ కుమార్ బృందం పేరిణి శివతాండవం, తెలుగు ఇండియన్ ఐడల్ రన్నరప్ పి. జయరామ్, జీ సరిగమప రన్నరప్ దాసరి మేఘనా నాయుడు, ప్లేబ్యాక్ సింగర్ దువ్వురి శ్రీధ్రుతి, అమెరికా నుంచి విచ్చేసిన శ్రిత పెండ్యాల వంటి గాయనీ గాయకుల సంగీత విభావరి, తెలంగాణ జానపద కళాకారుడు తిరుపతి మాట్ల బృందం ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, క్రీడల సమన్వయకర్త విజయ్ గోలి పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు శ్రీధర్ బాణాల, కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు పాల్గొన్నారు. సంగీత, నృత్య రూపకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ గ్రాండ్ ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.






