అమెరికాలో జీయర్ ట్రస్టు ఆలయంపై… 10 లక్షల డాలర్ల దావా
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ఆలయంలో గతేడాది ఆగస్టులో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో 11 ఏళ్ల బాలుడి రెండు భుజాలపై ఎర్రగా కాల్చిన శంఖు, చక్రాల గుర్తులు కల కడ్డీలతో ముద్ర వేయడం వివాదాస్పదమైంది. బాలుడి తండ్రి విజయ్ చెరువు ఆలయం నుంచి, ఆలయ నిర్వహణ సంస్థ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (అమెరికా) నుంచి 10 లక్షల డాలర్ల నష్టపరిహారం కోరుతూ ఇటీవల దావా వేశారు. తమ కుమారుడిని తన మాజీ భార్య గుడికి తీసుకెళ్లి ముద్ర వేయించడంతో అతడు ఎంతో బాధకు గురయ్యాడని కోర్టుకు తెలిపారు. దీనికి తండ్రి అనుమతి లేదని, టెక్సస్‌లో తల్లిదండ్రుల అనుమతి ఉన్నా లేకున్నా బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రుపెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని విజయ్ న్యాయవాది బ్రాంట్ స్టోగ్నర్ పేర్కొన్నారు. ఈ వ్యహారంపై ఆలయ నిర్వాహకులు స్పందించలేదు.







