Ghatkesar: పుట్టిన ఊరిపై మమకారం.. చదువుల తల్లికి మణిహారం: కొర్రెముల యువత ఆదర్శం
- అమెరికాలో స్థిరపడినా స్వగ్రామ అభివృద్ధికి చేయూత..
- డైనింగ్ హాల్, సిసి కెమెరాల ఏర్పాటు.. ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఘట్కేసర్: ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరును, చదువుకున్న బడిని మరువకూడదని నిరూపించారు మేడ్చల్ జిల్లా కొర్రెముల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు. అమెరికాలో స్థిరపడి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, తమ గ్రామంపై మమకారంతో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) సహకారంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..
కొర్రెముల గ్రామానికి చెందిన బైనగారి నరేశ్ అమెరికాలో స్థిరపడి, తన గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. టీటీఏ (TTA) ఆధ్వర్యంలో కొర్రెముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా డైనింగ్ హాల్‌ను నిర్మించారు. అలాగే భద్రతా దృష్ట్యా మక్త గ్రామంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రిబ్బన్ కత్తిరించి ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “తమ ఎదుగుదలకు పునాది వేసిన గ్రామానికి, చదువు చెప్పిన బడికి తిరిగి సేవ చేయడం గొప్ప విషయం. నరేశ్ వంటి యువతను మరికొందరు స్ఫూర్తిగా తీసుకోవాలి. పేద విద్యార్థులు చదివే పాఠశాలలో వసతులు కల్పించడం వల్ల వారు మరింత ఉత్సాహంగా చదువుకుంటారు” అని కొనియాడారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీఏ అధ్యక్షుడు ఎం. నవీన్ రెడ్డి, సభ్యులు బైనగారి నరేశ్ దంపతులు, వారి తల్లిదండ్రులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






