Tamannaah : తమన్నా, కాజల్‌లను విచారించనున్న పోలీసులు

పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి సినీతారలు తమన్నా(Tamannaah) , కాజల్ అగర్వాల్ (Kajal Garhwal )లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు (Police) నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందొచ్చని ఆశ చూపి పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు 2.40 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు లాస్‌పెట్టేకు చెందిన ఆశోకన్ (Ashokan) అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. క్రిప్టో కరెన్సీ కంపెనీ 2022లో కోయంబత్తూరు (Coimbatore) ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి తమన్నా, ఇతర ప్రముఖలు పాల్గొన్నారు. మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ కంపెనీ కార్యక్రమానికి నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబయిలోని ఒక ఓడలో భారీ పార్టీ నిర్వహించి, వేలాది మంది నుంచి డబ్బు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి నితీష్ జెయిన్ (36), అరవింద్‌కుమార్(40) అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్‌లను విచారించాలని నిర్ణయించారు.