Ram Gopal Varma: ఈ సారి పోలీసులనే టార్గెట్.. అంతు చిక్కని వర్మ వైఖరి..

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తరచుగా తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఆయనకు అవన్నీ పెద్దగా పట్టవనే చెప్పాలి. తన పని తాను చేసుకుపోతూ, విమర్శలను అంతగా పట్టించుకోని వర్మ తాజాగా పోలీసుల విచారణకు హాజరై మరింత హాట్ టాపిక్ అయ్యారు. అసలే పోలీసులు, పైగా విచారణ అనే విషయం వచ్చినప్పుడు సాధారణంగా ఎవరైనా భయపడతారు. అయితే విచారణ మొదలయ్యే ముందు వర్మకు ఆ భయం ఉండొచ్చేమో గానీ, అది పూర్తయిన తర్వాత మాత్రం అతను పూర్తిగా రిలాక్స్ అయ్యారు.
వర్మపై కేసు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu), మంత్రి నారా లోకేష్ (Lokesh) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే. ఈ కారణంగా వర్మను పోలీసులు విచారించాల్సి వచ్చింది. గత శుక్రవారం ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు హాజరైన వర్మను ఏకంగా తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వర్మ ఊపిరి పీల్చుకున్నట్టుగా “బతుకు జీవుడా” అంటూ వ్యాఖ్యానించారు.
అక్కడితో ఆగకుండా, విచారణ పూర్తయిన తర్వాత నేరుగా వైసీపీ నేతల దగ్గరకు వెళ్లి ఒంగోలు లోనే గడిపినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన ఆనందంలో అయన ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు సమాచారం. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆయన ప్రత్యేకత. అదీగాక, పోలీసుల పట్ల తనదైన స్టైల్లో వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ “ఐ లవ్ ఒంగోలు.. అండ్ ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్.. త్రీ చీర్స్” అంటూ పోస్ట్ చేశారు.
వర్మ కేసు విచారణ సమయంలో ముందస్తు బెయిల్ కోసం అష్టకష్టాలు పడ్డప్పటికీ, విచారణ ముగిసిన తర్వాత ఏ మాత్రం భయపడకుండా పోలీసుల గురించే కామెంట్ చేయడం ఆశ్చర్యకరంగా మారింది. పోలీసులు ఏం ప్రశ్నించినా ధైర్యంగా సమాధానం చెప్పినట్టు చెబుతున్న వర్మ, విచారణ అయిపోయిన తర్వాత మాత్రం పూర్తి రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఆయన చేసిన పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వర్మ తనదైన స్టైల్లో తన భావాలను వ్యక్తం చేశాడని అంటుంటే, మరికొందరు విచారణకు హాజరైన వర్మ ఇలా పోలీసులనే టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ఏదేమైనా, రాంగోపాల్ వర్మ ఎప్పటిలాగే మరోసారి వార్తల్లో నిలిచారు.