Pushpa 2 OTT: ఓటీటీ లో పుష్ప2.. తగ్గేదేలేదంటున్న పుష్పరాజ్..

‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ (Iconic star) అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. సంక్రాంతి పండుగకు ముందే రూ. 1830 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు. అయితే సంక్రాంతి తర్వాత మరో 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను జోడించి ‘పుష్ప 2 రీలోడెడ్’ (Pushpa 2 reloaded) పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. దీనితో సినిమా మళ్లీ మంచి వసూళ్లను సాధించి, దాదాపు రూ. 2000 కోట్ల మార్క్‌ను దాటినట్లుగా ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక సినిమా ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడుకుంటే, సంక్రాంతి సమయంలోనే ‘పుష్ప 2’ ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ వార్తలను ఖండిస్తూ, సినిమా విడుదలైన 56 రోజుల తర్వాతే ఓటీటీలో రానుందని స్పష్టం చేశారు. ఆ గడువు పూర్తికావడంతో ‘పుష్ప 2 రీలోడెడ్’ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా, విడుదలైన కొన్ని గంటల్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి ఎక్కింది. ఇకపోతే, ఈ సినిమా మొత్తం 3 గంటల 40 నిమిషాల నిడివితో ప్రేక్షకులను ఓటీటీలో కూడా అలరిస్తోంది.
‘పుష్ప 2’ కథ విషయానికి వస్తే, శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప, ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపారంలో ఎదిగి తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ఎదుగుదలతో శత్రువులు పెరుగుతూనే ఉంటారు. ఈ క్రమంలో అతని జీవితంలో చోటుచేసుకునే ఎన్నో మలుపులతో కథ ఆద్యంతం ఆసక్తిగా ముందుకు సాగుతుంది.
సినిమాలో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో సాగుతుంది. అల్లు అర్జున్ యాక్షన్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మిర్టల్ సమీర్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత బలం ఇచ్చాయి. మొత్తంగా థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.