Phule: “ఫూలే” సినిమా ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది – పొన్నం రవిచంద్ర
భారతజాతి గర్వించదగ్గ గొప్ప సామాజిక సంస్కర్తలు మహాత్మ పూలే, సావిత్రీబాయి పూలే జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఫూలే”. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర “ఫూలే” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర. ఈ కార్యక్రమంలో “ఫూలే” సినిమాకు పనిచేసిన ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ – ఈ రోజు మన ఆడబిడ్డలు చదువుకుని గొప్ప స్థాయికి వెళ్తున్నారంటే కారణం సావిత్రీబాయి పూలే ఎన్నో ఏళ్ల కిందట చేసిన కృషి కారణం. సమాజంలోని ఎన్నో దురాచారాలను రూపుమాపేందుకు పూలే దంపతులు పోరాటం చేసి, సమాజ హితం కోసమే తమ జీవితాలను అంకితం చేశారు. మూఢ నమ్మకాలు, దురాచారాల నుంచి మహిలళను కాపాడేందుకు వారు చేసిన కృషి అద్భుతమైనది. వితంతు పునర్వివాహాలు జరిపించారు. ఇలాంటి గొప్పవారి జీవిత చరిత్ర మన వాళ్లకు సినిమా మాధ్యమం ద్వారా తెలియజెప్పాలనే “ఫూలే” సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నాం. గతంలో పైడి జయరాజ్ వంటి నేను అనేక డాక్యుమెంటరీస్ ద్వారా అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు పొందాను. ఇది హిందీ అనువాదమైనా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. తెలుగు చిత్రంలాగే ఉంటుంది. మాటలు, పాటల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. ఎంఎం శ్రీలేఖ గారు సంగీతాన్ని అందించారు. పూర్ణ చంద్ర, డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి పాటలు రాశారు. చేతన్ కత్తి డైలాగ్స్ అందించారు. తిరుపతి, జనని నిర్మాణ పర్యవేక్షణలో “ఫూలే” సినిమాను తెలుగు ప్రేక్షకులకు విజయవంతంగా అందించబోతున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు “ఫూలే” సినిమాను విడుదలకు తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా మా సినిమాకు సహకారం అందించాలని కోరుతున్నా. అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొని “ఫూలే” సినిమాకు పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.






