Secret Zoo: ఓటీటీ లో నవ్వులు పూయిస్తున్న కొరియన్ కామెడీ మూవీ సీక్రెట్ జూ..

కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు మన దేశంలోకి వచ్చాక మంచి ఫాలోయింగ్ సంపాదించాయి. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండటం, కొత్త కొత్త కథలు, విభిన్నమైన కథనాలతో రావడం వల్ల వీటి క్రేజ్ పెరిగింది. తెలుగు ప్రేక్షకులు కొరియన్ వెబ్ సిరీస్‌లను మన టీవీ సీరియల్స్ చూసినట్లు చూస్తున్నారు. అదే విధంగా, కొరియన్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ‘సీక్రెట్ జూ’ అనే ఒక వినోదాత్మక చిత్రం. ఈ సినిమా 2020లో విడుదలై మంచి కామెడీ ఎంటర్టైనర్‌గా గుర్తింపు పొందింది. సన్ జే-గోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అహ్న్ జే-హాంగ్, కాంగ్ సో-రా, పార్క్ యోంగ్-గ్యు, కిమ్ సంగ్-ఓహ్, జియోన్ యో-బీన్ కీలక పాత్రలు పోషించారు. ఇది ‘I Don’t Bully You’ అనే వెబ్‌టూన్ ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథలో హీరో ఒక పెద్ద లాయర్ వద్ద జూనియర్ లాయర్‌గా పని చేస్తుంటాడు. అతని బాస్‌కి ఒక కీలకమైన కేసు వస్తుంది. ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ కొడుకు మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్నాడు. ఈ కేసుపై పూర్తి సమాచారం తెలుసుకోవాలని బాస్ భావిస్తాడు. ఈ పనిని హీరోకు అప్పగిస్తాడు. ఇదే సమయంలో హీరో పొరపాటున తన బాస్‌ను ప్రమాదం నుంచి కాపాడతాడు. దీంతో బాస్‌కి హీరోపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.
హీరోని పరీక్షించడానికి, బాస్ అతనికి మరో పని అప్పగిస్తాడు. కార్పొరేట్ కంపెనీకి చెందిన ఓ జూ దివాలా తీయడానికి దగ్గరగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేసి, మరింత ఎక్కువ రేటుకు అమ్మే ప్లాన్ బాస్ చెప్తాడు. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే, హీరోకు పర్మినెంట్ జాబ్ ఇస్తానని హామీ ఇస్తాడు. దీంతో హీరో ఆ జూ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత అసలు పరిస్థితి తెలుసుకుంటాడు. అక్కడ నాలుగు లేదా ఐదు జంతువులు మాత్రమే ఉంటాయి. జూలో పనిచేసే ఉద్యోగులు కూడా ఇక అక్కడ పని చేయాలనే ఆసక్తి లేకుండా ఉంటారు. హీరో వారికి మోటివేషన్ ఇచ్చి, జూలో ఉండేటట్లు చేస్తాడు. కానీ జంతువులు లేని కారణంగా సందర్శకులు రావడం లేదు. దీన్ని గుర్తించిన హీరో, అక్కడ పని చేసే ఉద్యోగులనే జంతువుల వేషాలు వేయించి, జూకు వచ్చిన సందర్శకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ కొత్త ఆలోచన అమలు చేయడంతో, జూకు జనాల రద్దీ పెరుగుతుంది. హీరో చేసే ప్రయత్నాలతో జూ క్రమంగా అభివృద్ధి అవుతుంది. ఈ విజయానికి బాస్ సంతోషించి, హీరోను అభినందిస్తాడు.
అయితే, అనుకోకుండా మరో సమస్య ఉత్పన్నమవుతుంది. కంపెనీ యజమానులు ఈ స్థలం విలువ పెరిగిందని, జూని మూసివేసి అక్కడ ఒక కార్పొరేట్ హోటల్ నిర్మించాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న హీరో బాధపడతాడు. కానీ ఇది జూలో పనిచేసే వారెవరూ ఇప్పటివరకు తెలియదు. ఇదే సమయంలో, వాళ్లు హీరోని అభినందించేందుకు ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. చివరికి ఈ విషయం వారికి తెలుస్తుందా? కార్పొరేట్ కంపెనీ వారు తమ ప్లాన్‌లో విజయవంతమవుతారా? హీరో తన లక్ష్యాన్ని సాధించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, ఈ కామెడీ మూవీ ని తప్పకుండా చూడాల్సిందే.