ibomma: ‘ఐబొమ్మ’కు బ్రేక్… ఊపిరి పీల్చుకున్న సినిమా ఇండస్ట్రీ!
తెలుగు సినిమా పరిశ్రమకు (Tollywood) నిద్రలేని రాత్రులు మిగిల్చిన ప్రముఖ పైరసీ (piracy) వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) కు బ్రేక్ పడింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని (Immadi Ravi) హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. “దమ్ముంటే పట్టుకోండి” అంటూ ఇండస్ట్రీకి, పోలీసులకు సవాల్ విసిరిన రవి… ఊహించని విధంగా పోలీసుల వలకు చిక్కడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుతో దశాబ్దకాలంగా పైరసీ భూతంతో సతమతమవుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ భారీ విజయాన్ని సాధించినట్లైంది.
ప్రతి కొత్త సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఐబొమ్మ వెబ్ సైట్ ఉచితంగా, అత్యుత్తమ రిజల్యూషన్‌లో సినిమాలు అందించేది. దీనివల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు భారీగా దెబ్బతినేవి. నిర్మాతల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూసేవారు. ఐబొమ్మ తరచూ డొమైన్లను మార్చడం, సర్వర్లను దేశ సరిహద్దులు దాటి మార్చడం ద్వారా పోలీసులకు సవాల్ విసురుతూ ఉండేది. అయితే, సైబర్ క్రైమ్ పోలీసులు రవి కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు. సాంకేతిక ఆధారాలు, సర్వర్ ట్రాకింగ్, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి అతని ఆచూకీని పసిగట్టగలిగారు. సుదీర్ఘ నిఘా, పక్కా ప్రణాళికతో పోలీసులు ఇమ్మడి రవిని పట్టుకోవడంలో విజయం సాధించారు. ఈ అరెస్టు వెనుక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల నిబద్ధత, పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది.
రవి అరెస్టు వార్త తెలియగానే టాలీవుడ్లో పండగ వాతావరణం నెలకొంది. పైరసీ వల్ల ఏటా వేల కోట్లు నష్టపోతున్నామని వాపోతున్న నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు హైదరాబాద్ పోలీసులను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి తదితరులు కమిషనర్ సజ్జనార్ ను కలిసి అభినందించారు. ఐబొమ్మ అనేది కేవలం ఒక సినిమాకు కలిగే నష్టం కాదని, వేలాది మంది కార్మికుల పొట్ట కొట్టేదని వెల్లడించారు. ఈ అరెస్టుతో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి వచ్చిందన్నారు. పోలీసులు చూపించిన అద్భుతమైన పనితీరును ప్రశంసించకుండా ఉండలేమని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఇకపై పైరసీకి పాల్పడేవారికి ఇది గట్టి హెచ్చరిక అన్నారు.
మరోవైపు ఐబొమ్మ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. వెబ్‌సైట్‌ను ఈ దేశంలో శాశ్వతంగా క్లోజ్”చేస్తున్నట్లు నిర్వాహకులు అందులో పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ పరిశ్రమకి దశాబ్దకాలంగా వేధిస్తున్న పైరసీ ముప్పు నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లైంది.
అయితే.. ఇమ్మడి రవి అరెస్టుపై సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది నెటిజన్లు రవి చర్య చట్టవిరుద్ధమని ఖండించినప్పటికీ, అతడిని సమర్థిస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్స్క్రిప్షన్ ఖర్చులు సామాన్యుడికి భారంగా మారాయని కొందరు వాదిస్తున్నారు. సినిమా పరిశ్రమ సామాన్యులను దోచుకుంటున్నప్పుడు, రవి ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పించి వారికి న్యాయం చేశాడు. పేదవాడి ఎంటర్టైన్మెంట్ హక్కును కాపాడాడు.. అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరో వర్గం మాత్రం ఇది మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన అని, ఇది పూర్తిగా చట్టవ్యతిరేక కార్యకలాపమని స్పష్టం చేస్తున్నారు. ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతలకు, అందులో పనిచేసిన వేలాది మందికి హక్కు ఉంటుంది. పైరసీ ద్వారా దొంగతనం చేయడాన్ని సమర్థించడం తప్పు అని, చట్టాన్ని గౌరవించాలని పిలుపునిస్తున్నారు.
ఇమ్మడి రవి అరెస్టు టాలీవుడ్‌కు ఒక చారిత్రక విజయం అయినప్పటికీ, పైరసీ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. ఇది డొమైన్లు, సర్వర్లు, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ల ద్వారా నడిచే ఒక వ్యవస్థ. రవి అరెస్టుతో ఐబొమ్మ తాత్కాలికంగా మూతపడినప్పటికీ, ఇతర పైరసీ సైట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఈ అరెస్టు ఇండస్ట్రీకి ఇచ్చిన అతిపెద్ద అవకాశం ఏమంటే – టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం, ఓటీటీ రిలీజ్‌లలో మార్పులు చేయడం వంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. చట్టబద్ధతతో పాటు, ప్రజలు సినిమాను థియేటర్లో లేదా చట్టబద్ధమైన ప్లాట్‌ఫామ్‌లలో చూడటానికి ప్రోత్సహించే వాతావరణం కూడా అవసరం. ఇమ్మడి రవి అరెస్టు భవిష్యత్తులో పైరసీకి పాల్పడేవారికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తుంది.






