Balakrishna: కొడుకుని ఆ డైరెక్టర్ చేతిలో పెట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అంటూ.. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు మూడు ఏళ్ల నుంచి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. దాదాపు ఏడాది క్రితం యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనబడింది. అధికారిక ప్రకటన చేయడమే కాకుండా, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది.
ఈ విషయంలో సినిమా యూనిట్ గాని దర్శకుడు గానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం మరో స్టోరీని, మరో డైరెక్టర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. జెర్సీ సినిమా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. జెర్సీ మాదిరిగానే ఇది కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కథను నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కి వినిపించినట్లు తెలుస్తోంది.
ఆమె ఓకే చెప్పటంతో బాలకృష్ణ కూడా దాదాపుగా ఓకే చెప్పారట. అయితే కొన్ని కొన్ని మార్పులు చెప్పడంతోనే కాస్త ఆలస్యం అవుతుందని, దసరా నాటికి సినిమా అధికారికంగా మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగా జరుగుతోంది. వాస్తవానికి గౌతమ్.. కింగ్డమ్(Kingdom) సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేయాల్సి ఉంది. కానీ పెద్ది సినిమాతో రామ్ చరణ్(Ram Charan) బిజీ అయిపోవడంతో, ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నట్లు కూడా సమాచారం. అటు మోక్షజ్ఞ కోసం మరో యువ దర్శకుడు కూడా కథ చెప్పాడని, అయితే బాలకృష్ణకు అది నచ్చలేదని ప్రస్తుతం, కాస్త సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని నందమూరి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు.