గంగాధర శాస్త్రి తండ్రి కాశీ విశ్వనాథ శర్మ మృతి – AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం
భగవద్గీత ఫౌండేషన్ అధ్యక్షులు గంగాధర శాస్త్రి తండ్రి కాశీ విశ్వనాథ శర్మ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం తెలిపారు.
సీనియర్ జర్నలిస్ట్, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్. గంగాధర శాస్త్రి తండ్రి కాశీ విశ్వనాథ శర్మ (84) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో పండిత కుటుంబంలో జన్మించిన కాశీ విశ్వనాథ శర్మ నాలుగు దశాబ్దాల క్రితం కుమారుల ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ఆయన పెద్ద కుమారుడు గంగాధర శాస్త్రి ఈనాడు గ్రూప్ లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం నేపథ్య గాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ, విదేశాలలోని సంగీత విభావరులలో పాల్గొన్న గంగాధర శాస్త్రి భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించారు. భగవద్గీతలోని అన్ని శ్లోకాలను స్వీయ స్వర కల్పనలో ఆలపించడమే కాకుండా దానికి విశేష ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాశీ విశ్వనాథ శర్మ రెండవ కుమారుడు ఎల్. వేణుగోపాల్ సైతం జర్నలిజంలో రాణించారు. ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థలకు పీ.ఆర్.ఓ.గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ కథానాయకులు పవన్ కళ్యాణ్ చిత్రాలకు వేణుగోపాల్ పీ.ఆర్.వో. జనసేన పార్టీ మీడియా విభాగానికీ ఆయన సేవలు అందిస్తున్నారు.
కాశీ విశ్వనాథ శర్మ మృతిపట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆధ్యాత్మిక, వేద సంబంధిత అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి కాశీ విశ్వనాథ శర్మ అని కొనియాడారు. ఆయన ప్రోత్సాహంతోనే పెద్ద కుమారుడు గంగాధర శాస్త్రి భగవద్గీతలోని శ్లోకాలు అన్నింటికీ బాణీలు సమకూర్చి గానం చేశారని తెలిపారు. కాశీ విశ్వనాథ శర్మ మృతి వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ ఫోన్ లో వేణుగోపాల్ ను పరామర్శించి, ఓదార్చారు. సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు గంగాధర శాస్త్రి, వేణుగోపాల్ సోదరులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. మంగళవారం తార్నాకలోని హిందూ శ్మశాన వాటికలో కాశీ విశ్వనాథ శర్మ అంత్యక్రియలు జరిగాయి.







