IBomma Ravi: ‘ఐబొమ్మ’ రవికి ఇంత ఫాలోయింగా..?
సినిమా పైరసీ అనేది చట్టరీత్య నేరం. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు అది మరణ శాసనం. కానీ, ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్ సైట్ నిర్వాహకుడు రవి (Immadi Ravi) అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో కనిపిస్తున్న స్పందన మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఒక నేరస్థుడికి మద్దతుగా లక్షలాది మంది గళం విప్పడం, “రవి మా హీరో” అని కీర్తించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన సామాజిక ధోరణిని ఎత్తిచూపుతోంది. అసలు రవికి ఎందుకింత మద్దతు లభిస్తోంది? ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?
రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి చేసిన పని చిన్నదేమీ కాదు. కేవలం కొత్త సినిమాలను పైరసీ చేయడమే కాకుండా, వాటిని హెచ్డీ (HD) క్వాలిటీలో సామాన్యులకు ఉచితంగా అందించాడు. ఉచితంగా సినిమాలు చూపిస్తూనే, ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్, గేమింగ్ సైట్లను ప్రమోట్ చేస్తూ రవి కోట్లు గడించాడు. సైట్ సందర్శించే వారి వ్యక్తిగత డేటాను సేకరించి, దానిని అక్రమ పనులకు వినియోగించే ప్రమాదం ఉందని పోలీసులు, నిపుణులు చెప్తున్నారు. రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువత ఆర్థికంగా నష్టపోయారని పోలీసులు చెబుతున్నారు. రవికి మద్దతు తెలిపే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు గట్టిగానే హెచ్చరించారు. అయినా, సోషల్ మీడియాలో రవికి మద్దతు వెల్లువలా వస్తూనే ఉంది. “చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అనే భయం ప్రజల్లో సన్నగిల్లిందా? లేక సినిమా ఇండస్ట్రీ తీరుపై ఉన్న ఆగ్రహం ఈ రూపంలో బయటపడుతోందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సామాన్య ప్రజలు ఒక పైరసీ దారుడిని వెనకేసుకు రావడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది సినిమా టికెట్ ధరల దోపిడీ. మల్టీప్లెక్స్‌లలో ఒక సామాన్య కుటుంబం సినిమా చూడాలంటే కనీసం రూ. 2వేల నుంచి రూ.3వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనికి తోడు ఓటీటీ (OTT)ల సబ్స్క్రిప్షన్ల భారం. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని మధ్యతరగతి వర్గానికి, ఐబొమ్మ ఒక ఉచిత వినోద సాధనంగా మారింది. ఇక రెండోది కంటెంట్ క్వాలిటీ. సినిమా బాగలేకుంటే ఎవరూ చూడరని, పైరసీ వల్ల సినిమా ఆడట్లేదనే సినిమా వాళ్ల వాదన కరెక్ట్ కాదని నెటిజన్లు చెప్తున్నారు. భారీ హైప్ ఇచ్చి, టికెట్ రేట్లు పెంచి, థియేటర్లో నాసిరకం సినిమాలు చూపిస్తున్నారనే కోపం ప్రేక్షకుల్లో ఉంది. ఇక మూడోది హిపోక్రసీ (Hypocrisy). రవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడని అంటున్నారు, మరి కోట్లు తీసుకుని అవే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న స్టార్ హీరోలను ఎందుకు ప్రశ్నించరు? అనే పాయింట్ రవికి మద్దతుగా నిలుస్తోంది. డేటా ప్రైవసీ విషయంలో కూడా, ప్రతి చిన్న యాప్ మా డేటా తీసుకుంటున్నప్పుడు, ఐబొమ్మ మాత్రమే డేటా దొంగిలించిందా? అనే లాజిక్ ను నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఒక రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా? అనేది అంతుచిక్కట్లేదు. డిజిటల్ ప్రపంచంలో ఒక వెబ్‌సైట్‌ను మూసివేస్తే, మరొక పేరుతో పది వెబ్సైట్లు పుట్టుకొస్తాయి. ఐబొమ్మ పోతే మరో బొమ్మ వస్తుంది. సాంకేతికతను పూర్తిగా నియంత్రించడం అసాధ్యం. సినిమా టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తేవడం, ఓటీటీ విడుదలలపై స్పష్టమైన విధానం ఉండటం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కారం కాగలదు.
తాత్కాలిక ఆనందం కోసం రవిని హీరోగా భావించడం భావోద్వేగ పరంగా సరిైనదే అనిపించినా, చట్టపరంగా, నైతికంగా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో కష్టపడి తీసిన సినిమాలను ఉచితంగా దోచుకోవడం సృజనాత్మకతను చంపేయడమే. అయితే, అదే సమయంలో సినిమా పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వినోదం వ్యాపారంగా మారినప్పుడు, వినియోగదారుడి ఆర్థిక స్తోమతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే, ఈ డిజిటల్ యుగంలో రవి లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారు, ప్రజలు వారికి జై కొడుతూనే ఉంటారు.






