Nagarjuna: ఏఐ దుర్వినియోగంపై నాగార్జున న్యాయ పోరాటం..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత పెరిగేకొద్దీ దాని దుర్వినియోగం కూడా ఎక్కువైపోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వీడియోలు, ఫోటోలు జెనరట్ చేసి వాడేసుకుంటున్నారు. తమ ఫోటోలను దుర్వినియోగం చేయడం వల్ల చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల ఫోటోలను కొంతమంది కించపరుస్తున్నారు. దీని వల్ల వాళ్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. దీంతో పలువురు సినిమా సెలబ్రిటీలు ఈ సమస్యను సీరియసా తీసుకుంటున్నారు. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనకు, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. అలాగే తన ఫోటోలు, వీడియోలును తన అనుమతి లేకుండా వాడకూడదనేలా ఆదేశాలివ్వాలని కోరారు.
అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తన ఫోటోలను అశ్లీలంగా మార్చేస్తున్నారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అనుమానాస్పద లింకులతో కూడిన మార్ఫింగ్ వీడియోలు సృష్టించి, యూట్యూబ్ షార్ట్స్ లో అప్‌లోడ్ చేస్తూ భారీ ఆదాయం సంపాదిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తన ఫోటోలను టీ-షర్టులు, ఇతర వస్తువులపై ముద్రించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు తన ప్రతిష్ఠకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, ఇలాంటి వాటిని వెంటనే అడ్డుకోవాలని కోర్టును కోరారు. ఇలా దుర్వినియోగానికి పాల్పడుతున్న సుమారు 14 వెబ్‌సైట్‌లు, వాటికి సంబంధించిన లింకులను ఇంటర్నెట్ నుంచి తక్షణమే తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది.
ఏఐ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దాన్ని సెలబ్రిటీలకు ముడిపెట్టి దుర్వినియోగ పరుస్తున్నారని నాగార్జున తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇది కేవలం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదని, సమాజంలోని మహిళలు, పురుషులందరి భద్రతకు కూడా ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాష్‌ట్యాగ్‌లతో కూడిన యూట్యూబ్ షార్ట్స్ ద్వారా భారీ వ్యూస్, రెవెన్యూ జనరేట్ అవుతున్నట్లు ఆధారాలు కూడా సమర్పించారు.
ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ అంశాలను తీవ్రంగా పరిగణించింది. “సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు కాపాడటం మా బాధ్యత. ఏఐ వల్ల ఏర్పడుతున్న ఈ సమస్యలకు తగిన చర్యలు తీసుకుంటాము” అని ధర్మాసనం హామీ ఇచ్చింది. మొదటి విచారణలోనే నాగార్జున లేవనెత్తిన ఆరోపణలపై సానుకూలంగా స్పందించింది. ఇంతకుముందు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి నటులు కూడా ఢిల్లీ హైకోర్టును ఇదే అంశంపై ఆశ్రయించారు. ఐశ్వర్యా రాయ్ కేసులో కోర్టు అడల్ట్ సైట్‌లలో ఆమె ఫోటోల మార్ఫింగ్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశంలో ఏఐ దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంలు, సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డీప్‌ఫేక్ వీడియోలు రాజకీయాలు, సినిమా, వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ రెగ్యులేషన్లపై కొత్త చట్టాలు రూపొందిస్తోంది.