Daaku Maharaj: ఓటీటీ లోకి ఆలస్యంగా డాకు మహారాజ్.. అసలు రీజన్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaj) సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కోల్లీ బాబీ (Kolli Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12న విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ. 56 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమా కావడం గమనార్హం.
ఈ చిత్రంలో బాలయ్య స్టైల్ యాక్షన్, బాబీ స్టైల్ మేకింగ్, తమన్ (Thaman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సినిమా హిట్ కావడంతో హిందీ సహా ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించిన ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. మొదట ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ ఉంటుందని వార్తలు వచ్చినా, అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, వచ్చే వారం నుంచి డాకు మహారాజ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు బాలయ్య అభిమానులకు ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా ఉండబోతోందని టాక్. థియేటర్ వెర్షన్ లోని కొన్ని అనుబంధ సన్నివేశాలు, ఓ ప్రత్యేక గీతం ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయట.
ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్, సచిన్ ఖేడ్‌కర్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. తమిళ, మలయాళ నటులు ఆడుకలం నరేన్, షైన్ టామ్ చాకో,మకరంద్ దేశ్ పాండే, రవికిషన్, బిగ్ బాస్ దివి, వీటీవీ గణేష్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ఏటువంటి రికార్డ్స్ సాధిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఓటీటీ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.