Chiranjeevi: అందరివాడు చిరంజీవి..! విమర్శలు – పొగడ్తలు..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేసిన కామెంట్స్ పై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో జగన్ సినిమా వాళ్లను అవమానపరిచారంటూ సహచర ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) కామెంట్స్ ను బాలకృష్ణ ఖండిస్తూ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తావన తెచ్చారు. ఇది మెగాస్టార్ (Megastar) అభిమానులకు నచ్చలేదు. దీంతో బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే చిరంజీవి వారించడంతో వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఈ సందర్భంగా చిరంజీవిపై పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వయంకృషితో టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగారాయన. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాని అండతోనే రాజకీయాల్లో కూడా తన సత్తా చాటాలనుకున్నారు. సొంత పార్టీ ప్రజారాజ్యం పెట్టారు. తొలి ఎన్నికల్లోనే 18 సీట్లు సాధించి కింగ్ మేకర్ అయ్యారు. అయితే దాన్ని ఎంతోకాలం నడపలేకపోయారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం అందులోనే ఉన్నారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోగానే ఆ పార్టీకి రాజీనామా కూడా చేయకుండానే సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చిరంజీవి యాక్టివ్ అయ్యారు. రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
మోదీ అధికారంలోకి వచ్చాక బీజేపీకి అనుకూలంగా మారిపోయారు. ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉండడం కలిసొచ్చింది. 2024లో ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే చిరంజీవి మళ్లీ యాక్టివ్ అయ్యారు. అటు చంద్రబాబు, ఇటు మోదీ.. ఇలా అందరి నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. బీజేపీ తరపున ఆయన రాజ్యసభకు కూడా ఎన్నికవుతారనే ప్రచారం కూడా జరిగింది.
2019-2024 మధ్య ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ సినిమా ఇండస్ట్రీని దూరం పెట్టారు. దీంతో టాలీవుడ్ పెద్దలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో చొరవ తీసుకున్న చిరంజీవి, జగన్ ను కలిసి సమస్యలను చెప్పారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో వెళ్లి జగన్ ను కలిశారు. ఆ సందర్భంగా చిరంజీవిని జగన్ అవమానించారనే ప్రచారం జోరుగా సాగింది. సినిమా వాళ్లు జగన్ ఇంటి బయటకు రాగానే వీడియో విడుదల చేయడం, అందులో చిరంజీవి దండాలు పెట్టడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ నేతలు దారుణంగా విమర్శించారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, పెళ్లాలు, పిల్లలు.. ఇలా ఎవర్నీ వదల్లేదు. కానీ చిరంజీవి ఏనాడూ ఖండించలేదు. పవన్ కల్యాణ్ కు అండగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ కామెంట్ చేయగానే ఆయన ఓ లేఖ విడుదల చేశారు. అది కూడా అధికారింగా విడుదల చేయలేదు. అజ్ఞాత లేఖ అది. అధికారికంగా విడుదల చేస్తే ఎవరు ఏమనుకుంటారోననే భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు అర్థమవుతోంది.
ఇలా చిరంజీవికి అందరినీ కలుపుకుపోవడం, అందరినీ అల్లుకుపోవడం అలవాటే.! అయితే ఇది కొంతమందికి అస్సలు నచ్చట్లేదు. అవసరం కోసం ఆయన ఇలాంటి పనులు చేస్తుంటారని, ఓ విధానానికి కట్టుబడి ఉండరని విమర్శిస్తున్నారు. అందరివాడు అనిపించుకోవాలనే తాపత్రయం చిరంజీవిలో ఎక్కువగా కనిపిస్తోందని, అందుకోసం ఆయన ఏదైనా చేస్తారని చెప్పుకుంటున్నారు.