Allu Aravind: పవన్ చేసింది కరెక్ట్… అల్లు అరవింద్ బాసట..

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సినిమా రంగ సమస్యలు, థియేటర్ల బంద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. గత రెండు రోజులుగా ‘ఆ నలుగురు’ అనే పదం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, అల్లు అరవింద్ తన పరిధిలోని థియేటర్ల సంఖ్య, ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) తో తన సంబంధం, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) విడుదలవుతున్న సమయంలో థియేటర్లు బంద్ (Theatres Bandh) చేయాలంటూ ఎగ్జిబిటర్లు ఇచ్చిన పిలుపు సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సినిమా రంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమా రంగాన్ని ఆ నలుగురు శాసిస్తున్నారంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింది ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. “‘ఆ నలుగురు’ అనే చర్చలో తాను లేనని అరవింద్ చెప్పారు. 10 సంవత్సరాల క్రితం ఆ నలుగురు ఉండేవారు, కానీ ఇప్పుడు అది 10 మందికి పైగా ఉంది. నా వద్ద తెలంగాణలో ఒక్క AAA థియేటర్ మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 15 థియేటర్లకు మించి నా ఆధీనంలో లేవు” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన థియేటర్ పరిశ్రమలో తన పాత్ర పరిమితమని వివరించే ప్రయత్నం చేశారు. ఆ నలుగురిలో తాను భాగం కాదని నొక్కి చెప్పారు.
పవన్ కళ్యాణ్ థియేటర్ సమస్యలపై చేసిన వ్యాఖ్యలను అల్లు అరవింద్ సమర్థించారు. “పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినవి సమంజసంగా ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము కలిసి చర్చించాము. అయితే, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు కలవాలనే ఆలోచన చేయలేదు. పవన్ సినిమా విడుదల సమయంలో థియేటర్ల బంద్ అనే నిర్ణయం దుస్సాహసం” అని ఆయన అభిప్రాయపడ్డారు. “ఛాంబర్ ప్రెస్ మీటింగ్‌లు మూడు సార్లు జరిగాయి, కానీ నేను హాజరు కాలేదు. బంద్ చేయాలని చెప్పి మీటింగ్‌కు రమ్మన్నారు, అందుకే నేను వెళ్లలేదు” అని ఆయన తెలిపారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాతలు, ప్రభుత్వం కలిసి సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. “థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. అందరూ కలిసి ప్రభుత్వంతో చర్చలు జరిపితే సమస్యలు పరిష్కారమవుతాయి. ఛాంబర్ ఈ దిశగా ముందుకు రావాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య సమన్వయాన్ని గుర్తు చేశాయి.