Deepseek: ఏఐ డీప్ సీక్ సేఫేనా..? సెక్యూరిటీ లోపాలపై ఆందోళన…

చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (Deepseek) .. ప్రపంచవ్యాప్తంగా హవా కొనసాగిస్తోంది. ఆర్1 మోడల్ విడుదలతో మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. మనం కోరిన సమాచారాన్ని చిటికెలో, అది కూడా ఖచ్చితత్వంతో అందిస్తోంది. తన సామర్థ్యంతో చాట్ జీపీటీ(chat gpt), జెమినీలకు పోటీగా మారింది. ఈనేపథ్యంలోనే ఆ సంస్థకు సంబంధించిన కీలక విషయాలను ఇజ్రాయెల్ (Israel)కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ విజ్ పేర్కొంది. డీప్‌సీక్ చాలా సున్నితమైన డేటాను ఓపెన్ ఇంటర్నెట్‌కు చేరుస్తున్నట్లు గుర్తించామని విజ్ తెలిపింది.
‘దాదాపు ఒక మిలియన్‌కు పైగా లైన్ల డేటాను డీప్‌సీక్ సురక్షితంగా స్టోర్ చేయకపోవడంతో ఆ సమాచారం బయటకు వచ్చింది. వాటిలో డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీస్, యూజర్ల చాట్ లాగ్స్ సైతం ఉన్నాయి. ఆ సంస్థ నుంచి చాలా సున్నితమైన డేటా ఓపెన్ ఇంటర్నెట్‌కు చేరిన విషయాన్ని గుర్తించాం’ అని విజ్ బుధవారం తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఈ విషయంపై తన సంస్థ వారిని అప్రమత్తం చేసిన గంటలోనే డీప్‌సీక్ డేటాను భద్రపరిచిందని విజ్ సహ వ్యవస్థాపకులు అమీ లుత్వాక్ తెలిపారు. అంతేకాక.. ఇది కనుగొనడం చాలా సులభతరమన్నారు.
చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ (AI) రీసెర్చ్ సంస్థ డీప్‌సీక్. చైనాలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటుచేసుకున్న ఈ సంస్థ.. తాజాగా ఆర్1 పేరిట ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం. పూర్తి అడ్వాన్స్ ఏఐ మోడల్‌ను ఇలా పూర్తిగా ఉచితంగా అందిస్తుండడం విశేషం. దీన్ని వాడినవారు ఇతర ఏఐ మోడళ్లను కంపేర్ చేస్తూ.. మెరుగైన పనితీరు కనబరుస్తోందంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో డీప్‌సీక్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యాపిల్ యాప్ స్టోర్‌లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిన ఈ యాప్.. గూగుల్ ప్లేస్టోర్‌లోనూ నంబర్.1 స్థానంలో నిలిచింది. అమెరికాలోనే కాకుండా దాదాపు 51 దేశాల్లో డీప్‌సీక్ ప్లే స్టోర్‌లో అగ్రస్థానంలో ఉందని యాప్‌ఫిగర్స్ సంస్థ చెబుతోంది.
ఏఐ టెక్‌ను అభివృద్ధి చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ భావిస్తారు. కానీ, డీప్ సీక్ స్టార్టప్ మాత్రం చాలా తక్కువ వనరులతోనూ అద్భుతమైన ఏఐ టూల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం డీప్ సీక్ ఏఐ టూల్ రెండు (R1, R2) మోడళ్లలో అందుబాటులో ఉంది. ఇందులో R1 మోడల్ ఉచితం అని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ… ఓ చైనా స్టార్టప్ కంపెనీ సవాల్ విసరడం టెక్ దిగ్గజాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్‌ను కుదిపేసిన ఈ చైనా స్టార్టప్ అంతర్జాతీయంగా వేసేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది.