USA-CHINA: ట్రంప్ ను నమ్మాలా..? వద్దా..? అంతర్మథనంలో చైనా..

అమెరికా (America), చైనా (China)ల మధ్య పరస్పర సుంకాల వార్ కొనసాగుతోంది.. టారిఫ్‌లపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది. దీనికి సంబంధించి ..వాషింగ్టన్ ఇటీవల తీసుకున్న వాణిజ్య విధాన నిర్ణయాలు, సుంకాల తగ్గింపు విషయంపై అగ్రరాజ్యంతో చర్చలు జరపాలా..? వద్దా.. అని యోచిస్తున్నట్లు బీజింగ్ వెల్లడించింది. ‘‘టారిఫ్ సమస్యలపై బీజింగ్‌తో చర్చలు జరపాలనే ఆశను వ్యక్తంచేస్తూ అమెరికా సంబంధిత వర్గాల ద్వారా అనేకసార్లు సందేశాలను పంపింది. దీంతో చర్చల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని అధికారులతో సంప్రదించి ఓ అంచనాకు వస్తాము’’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే తమపై టారిఫ్ విధిస్తూ.. వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిందని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి అన్నారు. ఇప్పుడు ఆ దేశం తమతో చర్చలు జరపాలంటే తమతో నిజాయతీగా ఉండాలని తెలిపారు. బీజింగ్‌తో వ్యవహరిస్తున్న తప్పుడు పద్ధతులను సరిదిద్దుకొని.. తమపై విధించిన ఏకపక్ష సుంకాలను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అమెరికాతో బీజింగ్ సానుకూల చర్యలు చేపడుతుందని తెలిపారు.
మరోవైపు చైనానే టారిఫ్‌లపై చర్చల కోసం తీవ్రస్థాయిలో యత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. బుధవారం కూడా ఆయన మాట్లాడుతూ డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘చర్చల్లో మా నిబంధనలకు లోబడే ఒప్పందం చేసుకోనున్నాం. అదే మంచిది’’ అని ఆయన న్యూస్‌నేషన్ టౌన్ హాల్ కార్యక్రమంలో వెల్లడించారు. దాదాపు వారం రోజుల క్రితం ట్రంప్ ఇటువంటి ప్రకటనే చేయగా.. చైనా బహిరంగానే ఖండించింది. నాడు బీజింగ్ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ ‘‘ఇరుదేశాల మధ్య సంప్రదింపులు ఏమీ జరగడం లేదు. వాణిజ్య ఒప్పందం కుదరలేదు’’ అని చెప్పారు. అయితే ఈ అంశంపై భవిష్యత్తులో చర్చలకు సిద్ధమే అని చెప్పడం విశేషం. అయితే తాము చేసిన కొత్త వాణిజ్య ఒప్పందాల గురించి తమతో చర్చించడానికి 75 కంటే ఎక్కువ దేశాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది.
అధికారంలోకి వచ్చినప్పటినుంచి చైనాపై టారిఫ్‌ల కొరడా విసురుతున్న ట్రంప్ (Donald Trump).. బీజింగ్ నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాన్ని 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా చైనా కూడా అగ్రరాజ్య ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్‌లు ప్రకటించింది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య విభేదాలు భగ్గుమన్నాయి.