Budget: రక్షణ రంగానికి బడ్జెట్ లో పెద్దపీట

Parliment: 2047 నాటికి భారత సాయుధ దళాలను ‘స్వావలంబన’గా మార్చడానికి, వికసిత్ భారత్(vikasit bharat) కలను నెరవేర్చడానికి, కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతం రక్షణ మంత్రిత్వ శాఖకు(Defence ministry) కేటాయింపులు జరిగాయి. శనివారం పార్లమెంటులో సమర్పించబడిన కేంద్ర బడ్జెట్ 2025-26 లో రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.6,81,210.27 కోట్లు కేటాయించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా కంటే 9.53 శాతం ఎక్కువ.. అన్ని ఇతర మంత్రిత్వ శాఖలలో అత్యధికం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రూ.1.27 లక్షల కోట్ల రికార్డు రక్షణ ఉత్పత్తిని సాధించడం ద్వారా దశాబ్దంలో 174 శాతం వృద్ధిని సాధించింది. అదేవిధంగా, ఎగుమతులను రూ.21,083 కోట్లకు పెంచడం ద్వారా ప్రపంచ మార్కెట్‌లో మన దేశ ఉనికిని బలోపేతం చేసుకున్నాం.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నాం.
మంత్రిత్వ శాఖ ప్రకారం.. కేటాయించిన బడ్జెట్‌లో రూ. 1 లక్ష 80 వేల కోట్లు అంటే మొత్తం కేటాయింపులో 26.43 శాతం రక్షణ సేవలపై మూలధన వ్యయం కోసం ఖర్చు చేయబడుతుంది. సాయుధ దళాలకు కేటాయింపులు రూ.3,11,732.30 కోట్లు, ఇది మొత్తం కేటాయింపులో 45.76 శాతం. రక్షణ పెన్షన్ రూ.1,60,795 కోట్లు అంటే 23.60 శాతం .. మిగిలిన రూ.28,682.97 కోట్లు అంటే 4.21 శాతం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పౌర సంస్థలకు. ఇందులో రూ.1,48,722.80 కోట్లు మూలధన సముపార్జనలకు ఖర్చు చేయాలని ప్రణాళిక చేయబడింది, దీనిని సాయుధ దళాల ఆధునీకరణ బడ్జెట్ అని పిలుస్తారు. మిగిలిన రూ. 31,277.20 కోట్లు దేశవ్యాప్తంగా పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఆస్తుల సృష్టిపై మూలధన వ్యయం కోసం కేటాయించారు.
రికార్డు స్థాయి రక్షణ ఉత్పత్తి
భారతదేశ దేశీయ రక్షణ ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది. వాస్తవంగా చెప్పాలంటే రికార్డు స్థాయిగా చెప్పచ్చు. 2014-15లో రూ.46,429 కోట్ల నుండి దాదాపు 174 శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తిలో రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం ముందుకు సాగుతోంది. 2029 నాటికి భారతదేశం రక్షణ ఉత్పత్తిలో రూ. 3 లక్షల కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా తనను తాను మార్పుకునేదిశగా సాగుతోంది.
రక్షణ ఎగుమతుల్లో వృద్ధి
గత దశాబ్దంలో రక్షణ ఎగుమతులు 21 రెట్లు పెరిగాయి. ఇది ప్రపంచ రక్షణ రంగంలో ఎదుగుతున్న భారతదేశం పాత్రను ప్రతిబింబిస్తుంది. భారతదేశం ఇప్పుడు 100 కి పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. 2023-24లో భారతదేశం రక్షణ ఎగుమతులకు మొదటి మూడు గమ్యస్థానాలు అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా. ఇప్పుడు 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ. 50 వేల కోట్లకు పెంచడం లక్ష్యం. ఇది విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ భాగస్వామిగా మారాలనేది భారతదేశ ఆశయం.
ఎగుమతి పోర్ట్‌ఫోలియో
భారతదేశ ఎగుమతి పోర్ట్‌ఫోలియోలో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, డోర్నియర్-228 విమానాలు, చేతక్ హెలికాప్టర్లు, వేగవంతమైన ఇంటర్‌సెప్టర్ పడవలు, తేలికపాటి టార్పెడోలు వంటి అధునాతన పరికరాలు ఉన్నాయి. రష్యన్ సైన్యం పరికరాలలో ‘మేడ్ ఇన్ బీహార్’ బూట్లను చేర్చడం ఒక ముఖ్యమైన విజయం, ఇది ప్రపంచ రక్షణ మార్కెట్లో భారతదేశం ప్రమాణాలను హైలైట్ చేసింది. 2014 నుండి భారతదేశ రక్షణ రంగం గణనీయమైన మార్పులకు గురైంది. భారత సైనిక దళం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉండటం నుండి స్వావలంబన, స్వదేశీ ఉత్పత్తిపై దృష్టి సారించింది.