US-CHINA: ట్రేడ్ వార్ లో అమెరికా, చైనా ఢీ.. పంతాలకు పోతున్న ట్రంప్, జిన్ పింగ్..

ఒకరేమో ప్రపంచానికి పెద్దన్న.. మరొకరేమో ఆ ప్లేస్ మాదే అంటున్న డ్రాగన్.. కొన్నాళ్లుగా ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే.. ఇప్పుడు ట్రంప్ రాకతో అది ప్రపంచానికి సాక్షాత్కరిస్తోంది. ట్రంప్ (Trump) సంగతి బాగా తెలిసిన దేశాలన్నీ ఎందుకొచ్చిన తిప్పలు…అని ట్రంప్ దగ్గరకు వెళ్లి మరి టారిఫ్ లపై ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ.. చైనా మాత్రం తగ్గేదే లేదిక్కడ.. మేం చైనీయులం.. అమెరికా దగ్గర తలొంచమంటోంది. దీంతో పరిస్థితి కాస్త గంభీరంగా మారింది.
అమెరికా, చైనా (USA-China)ల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను డ్రాగన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను యూఎస్ 145 శాతానికి పెంచితే.. డ్రాగన్ నుంచి అదే రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచింది.
చైనాపై విధించిన సుంకాలను మొత్తంగా లెక్కిస్తే 145శాతంగా ఉంటాయని గురువారం శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాము విధించిన 84 శాతం సుంకాలను 125 శాతానికి పెంచుతూ తాజాగా చైనా ప్రకటించింది. శనివారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని ఒక నంబర్ గేమ్‌గా అభివర్ణించిన మంత్రిత్వ శాఖ.. ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ తతంగమంతా ఆచరణాత్మక ప్రాముఖ్యత లేనిదని, దీర్ఘకాలంలో రెండు దేశాలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పింది. చైనా వస్తువులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ఇకనుంచి యూఎస్ వేసే టారిఫ్‌లను తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది. వాషింగ్టన్ సుంకాలపై బీజింగ్ ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేయనున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా విధించిన సుంకాలపై చైనా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
సుంకాలపై అమెరికాతో తీవ్రంగా తలపడుతున్న చైనా ..బెదిరింపులకు తలొగ్గబోమంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే.. తుదివరకూ తామూ పోరాడతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్‌కియాన్ పేర్కొన్నారు. ‘చైనాతో డీల్ చేయాలంటే.. ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిళ్లు సరైన మార్గం కాదు. రెండు దేశాలు కలిసి కూర్చుని విభేదాల పరిష్కారానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నాం. పరస్పర గౌరవం అనే సిద్ధాంతాల ఆధారంగా చర్చలు జరగాలి’ అని యాంగ్‌కియాన్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్‌ల మోత మోగిస్తున్నారు. ఈనేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారి స్పందించినట్లు డ్రాగన్ ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. అమెరికా విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపుగా జిన్‌పింగ్ అభివర్ణించారు. బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరప్ తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. చైనా, యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందన్నారు. అప్పుడే తమ సొంత చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందన్నారు. అంతేగాకుండా అంతర్జాతీయ పారదర్శకత, న్యాయాన్ని కాపాడొచ్చని చెప్పారు. బీజింగ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.