Tata: టాటా సన్స్ ఛైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరన్
టాటా సన్స్ సారథిగా ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) ను మరో విడత కొనసాగించాలని టాటా ట్రస్ట్స్ బోర్డు (Tata Trusts Board) నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా మూడో విడత చంద్రశేఖరన్ గ్రూప్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రూప్ రిటైర్మెంట్ పాలసీకి భిన్నంగా టాటా ట్రస్ట్స్ బోర్డు ఆయనకు మరో విడత పొడిగింపు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని టాటా ట్రస్ట్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చంద్రశేఖరన్ ప్రస్తుతం రెండో విడత సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు 65 సంవత్సరాల వయసు నిండే నాటికి అంటే 2027 ఫిబ్రవరికి ఈ రెండో విడత అధికార కాలం పూర్తి కావలసి ఉంది. టాటా సన్స్ సారథిగా ఆయన రెండో విడత పదవీ కాలం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. టాటా సన్స్ బోర్డుతో ఆయన అనుబంధం 2016 అక్టోబరులో ప్రారంభం కాగా 2017 జనవరిలో ఆయనను టాటా సన్స్ చైర్మన్ (Chairman) గా నియమించారు. టాటా గ్రూప్ రిటైర్మెంట్ నిబంధనావళి ప్రకారం సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు 65 సంవత్సరాల వయసు నిండగానే రిటైర్ కావలసి ఉంది.






